Kishan Reddy: నిరుద్యోగ భృతి ఏమైందో కేసీఆర్‌ చెప్పాలి: కిషన్‌రెడ్డి

తొమ్మిదేళ్లుగా భారాస సర్కారు నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం, వివక్ష చూపుతోందని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు.

Updated : 13 Sep 2023 15:09 IST

హైదరాబాద్: తొమ్మిదేళ్లుగా భారాస సర్కారు నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం, వివక్ష చూపుతోందని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. నిరుద్యోగ యువత తెలంగాణ కోసం పోరాటం చేశారని.. 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారని చెప్పారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్‌ సర్కార్‌ నిరుద్యోగులను మోసం చేసిందంటూ భాజపా ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద ‘24 గంటల నిరాహార దీక్ష’ చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌ఛుగ్‌తో పాటు ముఖ్యనేతలు హాజరయ్యారు. 

కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని భావిస్తే కేసీఆర్ సర్కారు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆయన చేతగానితనం వల్ల ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి. అప్పు చేసి లక్షల రూపాయలు ఖర్చు చేసి పరీక్షలు రాస్తే.. ప్రశ్న పత్రాలు లీక్ చేశారు. ప్రశ్న పత్రాల లీకేజ్‌పై పోరాటం చేస్తే బండి సంజయ్‌పై కేసులు పెట్టారు. గత తొమ్మిదేళ్ల నుంచి డీఎస్సీ వేయలేదు. గ్రామాల్లోకి వచ్చి ఓట్లు అడిగే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదు. నిరుద్యోగ భృతి ఏమైందో ఆయన చెప్పాలి. హోంగార్డు రవీందర్ ఆత్మహత్య చేసుకోలేదు.. భారాస సర్కారు హత్య చేసింది. ప్రాజెక్టుల పేరుతో కమిషన్లు తీసుకుంటున్నారు. బంగారు తెలంగాణలో ఆర్థిక సంక్షోభం తీసుకొచ్చారు. ఖబడ్దార్ కేసీఆర్.. మిలియన్ మార్చ్ చేసిన చోటే మీ పార్టీని యువత పాతరేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ ఆర్థిక సహాయం చేసి బలోపేతం చేస్తున్నారు’’ అని కిషన్‌రెడ్డి ఆరోపించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని