Kishan Reddy: అధిష్ఠానాన్ని ఏదీ అడగలేదు.. పార్టీయే గుర్తించి ఇచ్చింది: కిషన్‌రెడ్డి

పార్టీని ఎప్పుడూ ఏదీ అడగలేదని.. అధిష్ఠానం గుర్తించి ఇచ్చిన అన్ని బాధ్యతలను క్రమశిక్షణతో నిర్వర్తించానని కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా నూతన అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి తెలిపారు.

Updated : 05 Jul 2023 17:57 IST

దిల్లీ: తాను పార్టీని ఎప్పుడూ ఏదీ అడగలేదని.. అధిష్ఠానం గుర్తించి ఇచ్చిన అన్ని బాధ్యతలను క్రమశిక్షణతో నిర్వర్తించానని కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా నూతన అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి తెలిపారు. తెలంగాణ భాజపా చీఫ్‌గా  నియమించిన  తర్వాత.. తొలిసారి  ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘మొదటిసారి ఎంపీగా గెలిచా.  నాలుగేళ్లలో సుమారు రెండేళ్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా చేశాను. కేంద్ర మంత్రిగా ప్రధాని మోదీ నాకు బాధ్యతలు ఇచ్చారు. దీంతో మరో రెండేళ్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా చేశాను. ఎప్పుడూ పార్టీని ఏదీ అడగలేదు.  మంత్రి అవుతానని.. కావాలని .. ఏదీ అడగలేదు. పార్టీయే నన్ను గుర్తించింది. ఇప్పటివరకు పార్టీ ఆదేశాలను పాటిస్తూ వచ్చాను. 1980 నుంచి ఈరోజు వరకు పార్టీ సైనికుడిగా పనిచేశా. నాకు పార్టీకి మించి ఏదీ లేదు. పార్టీయే నా శ్వాస. పార్టీ కోసం.. పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను.

జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం.. అందరితో కలిసి సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తా. వారితో చర్చించి  తెలంగాణలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో భాజపాను అధికారంలోకి తీసుకొచ్చే లక్ష్యంతో ముందుకెళ్తాం. తెలంగాణలో భాజపా అధికారంలోకి తీసుకొచ్చే ఆలోచనలో పార్టీ అధిష్ఠానం ఉంది. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తాం. ఇవాళ హైదరాబాద్‌లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం ఏర్పాటు చేశాం. జులై 8న ప్రధాని మోదీ వరంగల్‌ వస్తున్నారు.  ఈ రెండు రోజులు వరంగల్‌ సభ ఏర్పాట్లపై చర్చించి.. సభను విజయవంతం చేస్తాం’’ అని కిషన్‌ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌లో దక్షిణ భారత రాష్ట్రాల సమావేశం..

‘‘దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమైన నాయకులతో కూడిన సమావేశాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతున్నాం. కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, ఏపీ, తెలంగాణ, లక్షద్వీప్ చెందిన నాయకులు సమావేశానికి హాజరవుతారు. దక్షిణ భారతదేశంలో భాజపా తీసుకోవాల్సిన చర్యలు, రానున్న పార్లమెంట్‌ ఎన్నికలకు సన్నద్ధం, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై భేటీలో చర్చిస్తాం. దక్షిణ భారత్‌లో భాజపాను మరింత పటిష్టం చేయాలి.. అందుకు తీసుకోవాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన విధానాలపై సమావేశంలో చర్చిస్తాం’’ అని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని