Karnataka Elections: దేవేగౌడ కోడలికి చుక్కెదురు.. హాసన్‌లో జేడీఎస్‌ అభ్యర్థిపై వీడిన ఉత్కంఠ!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో Karnataka (Assembly Elections) హాసన్‌ నియోజవర్గంలో (Hassan Assembly) జేడీఎస్‌ (JDS) అభ్యర్థిత్వపై నెలకొన్న ఉంత్కఠకు తెర పడింది. శుక్రవారం పార్టీ రెండో విడుద అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో హాసన్‌ నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించింది. 

Published : 15 Apr 2023 00:29 IST

బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటక (Karnataka Assembly Elections)లో రాజకీయ పార్టీలు విడతల వారీగా అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో హాసన్‌ (Hassan Assembly) నియోజకవర్గంలో జేడీఎస్‌ (JDS) అభ్యర్థి ఎవరనే దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. ఇక్కడి నుంచి దేవేగౌడ పెద్ద కుమారుడు హెచ్‌డీ రేవణ్ణ (HD Revanna) భార్య భవానీ రేవణ్ణ (Bhavani Revanna) పోటీ చేస్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి ( HD Kumaraswamy) మాత్రం పార్టీ కోసం పనిచేసిన వ్యక్తికి హాసన్‌ టికెట్‌ కేటాయిస్తామని చెబుతూ వచ్చారు.

ఈ మేరకు పార్టీ  శుక్రవారం రెండో విడత అభ్యర్థుల జాబితాను వెలువరించింది. ఇందులో హాసన్‌ స్థానానికి జేడీఎస్‌ అభ్యర్థిని పార్టీ ఖరారుచేసింది. మాజీ ఎమ్మెల్యే హెచ్‌ఎస్‌ ప్రకాశ్‌ కుమారుడు హెచ్‌పీ స్వరూప్‌ పోటీ చేస్తారని కుమారస్వామి ప్రకటించారు. జేడీఎస్‌ను కుటుంబ పార్టీ అని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు తిప్పి కొట్టడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ‘‘ఈ ఉదయం భవానీ రేవణ్ణ నాతో మాట్లాడారు. హాసన్‌లో పోటీ చేసే అభ్యర్థిపై రేవణ్ణ, నేను చర్చించుకొని నిర్ణయం తీసుకున్నాం. మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు మా కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవు. రేవణ్ణ, భవానీ రేవణ్ణ మద్దతుతోనే హాసన్‌ అభ్యర్థిని నిర్ణయించాం’’ అని కుమారస్వామి చెప్పారు.

హాసన్‌ మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధ్యక్షుడు దేవే గౌడ (Deve Gowda) సొంత జిల్లా కావడంతో ఇక్కడి జేడీఎస్‌ అభ్యర్థి ఎవరనే దానిపై తీవ్ర చర్చ జరిగింది. ఈ జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌ ఆరు స్థానాల్లో గెలుపొందింది. గత ఎన్నికల్లో హాసన్ నిజయోక వర్గంలో భాజపా అభ్యర్థి పీతమ్‌ గౌడ విజయం సాధించారు. జేడీఎస్‌ రెండో విడత జాబితాలో గుండ్లుపేట స్థానం నుంచి కదబూర్‌ మంజునాథ్‌, యలహంక స్థానం నుంచి మునేగౌడ, శరవణనగర్‌లో ముస్తఫా, యశ్వంతపూర్‌ స్థానం నుంచి జావారే గౌడ, అరకలగూడు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి మంజు పోటీ చేస్తారని ప్రకటించింది. మొదటి విడత జాబితాలో 93 మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని