INDIA Bloc: ఇండియా కూటమికి ఎదురుదెబ్బ.. ఆ రాష్ట్రాల్లో ‘లెఫ్ట్’ హ్యాండ్‌ ఇచ్చిందా..?

INDIA Bloc: ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమిలో ఉన్న భేదాభిప్రాయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. విపక్ష పార్టీలు కూటమి బలోపేతం గురించి మాట్లాడుతూనే.. సొంత లక్ష్యాల సాధన దిశగా నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. 

Published : 18 Sep 2023 15:58 IST

దిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా(BJP)ను దీటుగా ఎదుర్కొనే లక్ష్యంతో ఏర్పాటైన ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి(INDIA Bloc)కి ఎదురుదెబ్బ తగిలినట్లు కనిపిస్తోంది. తన లక్ష్యసాధనలో కూటమిలోని పార్టీల నుంచే అవాంతరాలు ఎదురవుతున్నట్లు సమాచారం. పశ్చిమ్ బెంగాల్‌, కేరళలో తృణమూల్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌తో కలిసి ప్రయాణించకూడదని సీపీఎం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే సమన్వయ కమిటికీ తన పార్టీ తరఫున సభ్యుడిని పంపకూడదని అనుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

పశ్చిమ్‌ బెంగాల్‌లో భాజపా(BJP), తృణమూల్ కాంగ్రెస్‌(TMC)తో దూరం పాటించాలని  దిల్లీలో జరిగిన సీపీఎం పోలిట్‌బ్యూరో సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. విపక్షాల ఓట్లు చీలకుండా చూసే వ్యూహంలోనే భాగంగానే ఈ విధంగా ముందుకెళ్లనుందట. అలాగే 14 మంది సభ్యుల సమన్వయ కమిటీ సమావేశం ఇటీవల జరగ్గా దానికి లెఫ్ట్‌ హాజరుకాలేదు. ఆ పార్టీ వ్యవహారశైలి ఆశ్చర్యకరమే అయినా.. మమతకు కాస్త ఊరటే..! వామపక్ష నేతలతో వేదిక పంచుకునే విషయంలో ఆమె గతంలో తన ఇబ్బందిని వ్యక్తం చేశారు. కూటమిలో లెఫ్ట్‌-టీఎంసీతో పాటు ఆప్‌ - కాంగ్రెస్‌కు కూడా పొసగడం లేదు. మధ్యప్రదేశ్‌లో ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం ఆప్‌ అభ్యర్థులను ప్రకటించడం గమనార్హం.

‘జమిలి’ అంటే అంత ఉలికిపాటెందుకు..!

ఈ క్రమంలోనే భోపాల్‌లో ‘ఇండియా’ కూటమి వచ్చే నెల నిర్వహించతలపెట్టిన తొలి బహిరంగ సభ అనూహ్యంగా రద్దయింది. ఈ సభలో పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, అవినీతి, కులగణనలను ప్రస్తావించాలని ప్రణాళిక రచించింది. అయితే, ఈ బహిరంగ సభను రద్దు చేసినట్లు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ కమల్‌నాథ్ (Kamal Nath) శనివారం వెల్లడించారు.

దీంతో, విపక్ష కూటమిపై భాజపా వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది. సనాతన ధర్మాన్ని అవమానించినందుకు ప్రతిపక్షాల కూటమిపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ దుయ్యబట్టారు. ప్రజల ఆగ్రహానికి కూటమి భయపడిందని ఎద్దేవా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని