Prez polls: రాష్ట్రపతి ఎన్నికలు.. రంగంలోకి నడ్డా, రాజ్‌నాథ్‌ సింగ్‌!

Prez polls: అధికార భాజపా కదన రంగంలోకి దూకుతోంది. అభ్యర్థి ఎంపికలో ఏకాభిప్రాయ సాధనే లక్ష్యంగా సంప్రదింపులు జరపనుంది.

Updated : 13 Jun 2022 14:53 IST

దిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలకు (Prez polls) నగారా మోగిన వేళ తమ బలం చాటుకునేందుకు పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేసేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ నడుం బిగించారు. వివిధ పార్టీల నేతలకు లేఖలు రాశారు. ఈ క్రమంలో అధికార భాజపా సైతం కదన రంగంలోకి దూకుతోంది. అభ్యర్థి ఎంపికలో ఏకాభిప్రాయ సాధనే లక్ష్యంగా సంప్రదింపులు జరపనుంది. ఇందుకోసం ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సిద్ధమ్యారు. ఎన్టీయే భాగస్వామ్య పక్షాలు సహా ప్రతిపక్ష పార్టీల నేతలు, స్వతంత్ర అభ్యర్థులను వీరు కలవనున్నారు. త్వరలోనే వీరి సంప్రదింపులు ప్రారంభం కానున్నాయని భాజపా ఓ ప్రకటనలో తెలిపింది.

2017లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో భాజపా రామ్‌నాథ్‌ కోవింద్‌ను బరిలోకి దింపగా.. విపక్షాలు మీరా కుమార్‌ను తమ అభ్యర్థిగా నిలిపాయి. ఆ ఎన్నికల్లో అభ్యర్థిని ఎంపిక చేసిన తర్వాత ఆ పార్టీ తమను సంప్రదించిందని భాజపాపై విపక్షాలు మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో భాజపా ముందుగానే కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటికైతే అటు అధికార పార్టీగానీ, ఇటు ప్రతిపక్షాలు గానీ అభ్యర్థి ఎవరనేది ప్రకటించలేదు. జులై 18న ఎన్నికలు జరగనున్నాయి.

పవార్‌తో ఆప్‌ ఎంపీ భేటీ
రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ను ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌‘ కలిశారు. త్వరలో జరగోయే రాష్ట్రపతి ఎన్నికల విషయమై వీరిద్దరూ చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో దిల్లీలో భాజపాను ఓడించేందుకు ఆప్‌, కాంగ్రెస్‌ ఓ అవగాహనకు రావాలని పవార్‌ సూచించారు. అయితే, అది కార్యరూపం దాల్చలేదు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మరి ఈ భేటీలో ఏం చర్చించారన్నది బయటకు రాలేదు. మహారాష్ట్రలో ఎన్సీపీ భాగస్వామిగా ఉన్న మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వంలో కాంగ్రెస్‌ కూడా ఉన్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు