Chandra babu arrest: తెలంగాణలో లేని ఆంక్షలు ఏపీలోనే ఎందుకు: నారా లోకేశ్‌

తెలంగాణలో లేని ఆంక్షలు ఏపీలోనే ఎందుకని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశ్నించారు.

Published : 23 Sep 2023 17:26 IST

దిల్లీ: తెలంగాణలో లేని ఆంక్షలు ఏపీలోనే ఎందుకని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశ్నించారు. శాంతియుత నిరసనలపై కేసులు బ్రిటీష్‌ కాలంలో కూడా లేవన్నారు. బ్రిటీష్‌ పాలనను మించిన స్థాయిలో రాష్ట్రంలో ప్రజలు, తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు, నిర్బంధాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకి మద్దతుగా చేస్తున్న నిరాహార దీక్షలు, కొవ్వొత్తుల ర్యాలీలపైనా హత్యాయత్నం కేసులు అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ అని మండిపడ్డారు. 

తెదేపా అధినేతకు సంఘీభావంగా సముద్రతీరంలో సైకత శిల్పం ఏర్పాటు చేసిన వారిపైనా కేసు పెట్టడం లాంటి చర్య దేశంలో మరెక్కడా జరిగి ఉండదని విమర్శించారు. ఈ ప్రభుత్వం తీరు చూస్తుంటే.. సముద్ర గర్భంలో, అంతరిక్షంలో, భూగర్భంలో కూడా 144 సెక్షన్‌, 30 పోలీసు యాక్ట్‌ ఉందనేలా ఉన్నారని ధ్వజమెత్తారు. శాంతియుత నిరసనలు జరగడానికి వీల్లేదని సీఎం రివ్యూ చేసి మరీ డీజీపీకి ఆదేశాలు ఎందుకిచ్చారని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ నిరసనలు తెలిపే హక్కును కాదని చెప్పే హక్కు మీకెక్కడిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రాల్లో చంద్రబాబుకు మద్దతుగా జరుగుతున్న ర్యాలీలపై లేని నిషేధం ఏపీలోనే ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణలో లేని నిర్బంధాలు మన రాష్ట్రంలో ఎందుకో సైకో సర్కారు సమాధానం చెప్పాలని నిలదీశారు. ప్రజల నుంచి పుట్టిన ఉద్యమాన్ని.. ఈ ప్రభుత్వం తుప్పు పట్టిన అక్రమ కేసుల విధానంతో అడ్డుకోలేదని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని