AP News: ధూళిపాళ్ల చేసిన తప్పేంటి?: లోకేశ్‌

సంగం డెయిరీ కేసులో బెయిల్‌పై విడుదలైన ఆ సంస్థ ఛైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పరామర్శించారు.

Published : 27 May 2021 00:22 IST

విజయవాడ: సంగం డెయిరీ వ్యవహారంలో ఆ సంస్థ ఛైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చేసిన తప్పేంటో వైకాపా ప్రభుత్వం చెప్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశ్నించారు. పాడి రైతులకు లీటరుకు రూ.4 ఎక్కువ ఇవ్వడం.. ఆస్పత్రి ఏర్పాటు చేసి రైతులకు 50 శాతం రాయితీతో వైద్యం అందించడం ఆయన చెసిన తప్పా? అని నిలదీశారు. సంగం డెయిరీ కేసులో బెయిల్‌పై విడుదలైన ధూళిపాళ్ల నరేంద్రను నారా లోకేశ్‌ పరామర్శించారు. విజయవాడలోని ధూళిపాళ్ల ఇంటికి వెళ్లి ఆయనతో ఏకాంతంగా కాసేపు సమావేశమయ్యారు. ఆ తర్వాత కుటుంబసభ్యులను లోకేశ్‌ పరామర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

‘‘ రైతుల కోసం నిరంతం పోరాడిన వ్యక్తి నరేంద్ర. ప్రజల తరఫున పోరాడుతున్న తెదేపా నేతలను ఇబ్బంది పెడుతున్నారు. ఏపీలోని పాడిపరిశ్రమను గుజరాత్‌కు అమ్మేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ఒంగోలు డెయిరీని ఇప్పటికే అమూల్‌కు అప్పగించారు. అమూల్‌ డెయిరీ కోసం రూ.3వేల కోట్లు రుణం తీసుకున్నారు. ప్రజల సొమ్ముతో సోకులు చేస్తున్నారు. ప్రభుత్వ అవినీతిపై పోరాడుతుంటే అడ్డగోలుగా కేసులు పెడుతున్నారు. కరోనాతో ప్రజలు చనిపోతుంటే సీఎం జగన్‌ సరిగా సమీక్ష కూడా జరపడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతలపై అక్రమ కేసులు బనాయించారు. అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, కూన రవికుమార్‌, అశోక్‌ గజపతిరాజు, చింతమనేని ప్రభాకర్‌, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, సోమిరెడ్డి, భూమా అఖిలప్రియ, బీసీ జనార్దన్‌రెడ్డి.. ఇలా అందరిపైనా అక్రమకేసులు పెట్టారు’’ అని లోకేశ్‌ ఆరోపించారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని