Ajit Pawar:ఆ పదవికి సుప్రియ పేరును సూచించిందే నేను: అజిత్‌ పవార్‌

ఎన్సీపీ (ncp) అంతర్గత నియామకాలపై ఆ పార్టీ సీనియర్‌ నేత అజిత్‌ పవార్‌ (Ajit Pawar) అసంతృప్తిగా ఉన్నారంటూ వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. పార్టీ నిర్ణయంతో తాను సంతోషంగానే ఉన్నట్లు చెప్పారు. 

Updated : 11 Jun 2023 20:22 IST

దిల్లీ: నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ncp) కార్యనిర్వాహక అధ్యక్షులుగా సుప్రియా సూలే (Supriya Sule), ప్రఫుల్‌ పటేల్‌ (Praful Patel) నియమితులైన విషయం తెలిసిందే. ఈ ప్రకటన అనంతరం పార్టీ సీనియర్‌ నేత అజిత్‌ పవార్‌ (Ajit Pawar) పార్టీ కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. దీంతో ఈ నియామకాలపై అజిత్‌ పవార్‌ అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వచ్చాయి. పలు విపక్ష పార్టీలు ఎన్సీపీలో అజిత్‌కు ప్రాధాన్యత లేదని భావిస్తున్నాయి. తాజాగా వీటిపై అజిత్‌ స్పందించారు. పార్టీ నిర్ణయంతో తాను సంతోషంగానే ఉన్నానని, కార్యనిర్వాహక అధ్యక్ష పదవికి సుప్రియా సూలే పేరును సూచించిందే తానని తెలిపారు.

మీడియాతో అజిత్‌ మాట్లాడుతూ.. ‘‘దిల్లీలో పదవుల ప్రకటన అనంతరం నేను మీడియాతో మాట్లాడదామనుకున్నా. కానీ, అత్యవసరంగా పుణె వెళ్లాల్సి వచ్చింది. అందుకే స్పందించడం ఆలస్యమైంది. పార్టీ నిర్ణయంపై నేను సంతోషంగానే ఉన్నా. కార్యనిర్వాహక అధ్యక్ష పదవికి సుప్రియ పేరును సూచించిందే నేను. ఇప్పటికే పార్టీ నాకో బాధ్యత(అసెంబ్లీలో ప్రతిపక్ష నేత) అప్పగించింది. ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ.. రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టాను. ఇది మా పార్టీ అంతర్గత వ్యవహారం. ఇతరులు వీటికి దూరంగా ఉంటే మంచిది’’అని అన్నారు.  

ఎన్సీపీ పార్టీ 24వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ కార్యనిర్వాహక అధ్యక్షుల నియామకంపై ప్రకటన చేశారు. ఈ విషయంలో అజిత్‌ అసంతృప్తిగా ఏమీ లేరని స్పష్టం చేశారు. పార్టీ ఏకాభిప్రాయంతోనే ప్రఫుల్‌, సుప్రియలకు బాధ్యతలను అప్పగించామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని