Nitish Kumar: ‘నాకు ఆ ఆలోచన లేదు’: చేతులు జోడించి మరీ స్పష్టం చేసిన నీతీశ్‌

భాజపాతో బంధాన్ని తెంచుకొని ఆర్జేడీతో దోస్తీ కట్టిన బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యారు.

Published : 12 Aug 2022 14:35 IST

పట్నా: భాజపాతో బంధాన్ని తెంచుకొని ఆర్జేడీతో దోస్తీ కట్టిన బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యారు. ఈ సమయంలో ఆయన ప్రధాని పదవికి పోటీపడతారా..? అనే వార్తలు వినిపిస్తున్నాయి. దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వాటిపై మరోసారి స్పష్టత ఇచ్చారు.

ప్రస్తుతానికి తన మనసులో ప్రధానమంత్రి పదవి గురించి ఎలాంటి ఆలోచన లేదన్నారు. ‘అది నా మనసులో లేదు. నాకు సన్నిహితంగా మెలిగేవారితో సహా ఎవరు ఏం చెప్పినా నాకు సంబంధం లేదు’ అని చేతులు జోడించి మరీ స్పష్టం చేశారు. తాను ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తానని, అంతా కలిసి పనిచేస్తే బాగుంటుందన్నారు. ‘నేను అందరిని ఏకం చేయాలని అనుకుంటున్నాను. ఆ దిశగా సానుకూలంగా వెళ్తున్నాను. దీనికి సంబంధించి నాకు చాలా ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి’ అని వెల్లడించారు. బిహార్‌ ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో నీతీశ్‌ చేసిన వ్యాఖ్యలే.. ఆయన ప్రధాని పదవికి పోటీ పడతారనే చర్చకు దారితీశాయి. అప్పుడు మాట్లాడుతూ.. 2024 లోక్‌సభ ఎన్నికల గురించి భాజపా ఆందోళన చెందుతోందన్నారు. ‘2014లో ఆయన గెలిచారు.. కానీ 2024లో ఆ గెలుపు సాధ్యమవుతుందా..?’ అని ప్రధాని మోదీని ఉద్దేశించి అన్నారు.

2020లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నీతీశ్ పార్టీ జేడీ(యూ), భాజపా కూటమిగా పోటీ చేసి విజయం సాధించాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తన రాజకీయ మనుగడకు కాషాయం పార్టీ నుంచి ముప్పు పొంచి ఉందని భావించి.. దానికి గుడ్‌బై చెప్పారు. ఆర్జేడీతో కొత్త పొత్తు కుదుర్చుకొని మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని