Tejashwi Yadav: మాకు సీఎం..పీఎం కోరికల్లేవు: తేజస్వీ యాదవ్‌

సీఎం నీతీశ్‌కుమార్‌ (Nitish Kumar) తో కలిసి సంతోషంగా పని చేస్తున్నానని బిహార్‌ ఉపముఖ్యమంత్రి తేజస్వీయాదవ్‌ (Tejaswi Yadav) అన్నారు. ఇద్దరి మధ్య అగాధాన్ని సృష్టించేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని విమర్శించారు.

Published : 21 Mar 2023 01:38 IST

పట్నా: ముఖ్యమంత్రితో విభేదాలు పొడచూపుతున్నాయంటూ వస్తున్న వార్తలపై బిహార్‌ (Bihar) ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ (Tejaswi yadav) మరోసారి స్పందించారు. సీఎం నీతీశ్‌ కుమార్‌తో కలిసి సంతోషంగా పని చేస్తున్నానని అన్నారు. సీఎం తనపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా జీవించాలనుకుంటున్నానని చెప్పారు. ఇద్దరి మధ్య అగాధాన్ని సృష్టించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు ‘ఆయనకు ప్రధాని అవ్వాలని కానీ, నాకు సీఎం అవ్వాలని గానీ కోరికలు లేవు. ప్రస్తుతం ప్రజలు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే అదే చాలు’ అని అసెంబ్లీలో తేజస్వీ యాదవ్‌ పేర్కొన్నారు. భాజపా కూటమి నుంచి బయటకు వచ్చినందుకు నీతీశ్‌కుమార్‌కు మరోసారి కృతజ్ఞతలు తెలపాలన్నారు.

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నీతీశ్‌ కుమార్‌ ప్రధాని అభ్యర్థిగా ఉంటారని, ఆయన స్థానంలో తేజస్వీయాదవ్‌ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతారని ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై నితీశ్‌కుమార్‌ గతంలోనే స్పందించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి.. ప్రధాని అవ్వాలన్న కోరిక తనకు లేదని, అందువల్ల కార్యకర్తలెవరూ తనకు అనుకూలంగా అలాంటి నినాదాలు చేయొద్దని కోరారు. ‘ అలాంటి నినాదాలు చేయొద్దని కార్యకర్తకలు చెబుతూనే ఉన్నాను’ అంటూ ఓ జాతీయ మీడియా సంస్థకు గత నెలలో ఇచ్చిన ఇంటర్వ్యూలో నీతీశ్‌ పేర్కొన్నారు. తాజాగా డిప్యూటీ సీఎం కూడా ఆయన వెన్నంటి నిలిచారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడమే ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యమని చెప్పారు. నీతీశ్‌ కుమారే సీఎంగా ఉంటారని, ఆయన మార్గనిర్దేశంలోనే తామంతా కలిసి పని చేస్తామని అన్నారు. ఆయనకు పీఎం అవ్వాలనే కోరిక ఏమాత్రం లేదని తేజస్వీ పునరుద్ఘాటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని