
భాజపాతో ఏ రాజకీయ పార్టీ సాటిరాదు..!
భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా
ధర్మశాల: దాదాపు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల్లో కుటుంబ నేపథ్యం ఉన్నవేనని.. కొన్ని కోట్లమంది మద్దతు కలిగిన తమ పార్టీతో ఇతర ఏ రాజకీయ పార్టీ సరిపోలదని భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలతోపాటు ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేత(మోదీ) ఉండడం తమ పార్టీకి గొప్ప శక్తి అని అన్నారు.
‘18కోట్ల మంది ప్రజల మద్దతు కూడగట్టడం సాధారణ విషయం కాదు. దీనిని చేరుకోవడం ఏ రాజకీయ పార్టీకీ సాధ్యం కాదు’అని హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఓ సమావేశంలో భాజపా అధ్యక్షుడు జగత్‌ప్రకాశ్ నడ్డా స్పష్టంచేశారు. పార్టీకి అన్ని వర్గాల ప్రజల మద్దతు ఉందన్న ఆయన, ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేత తమ పార్టీలో ఉన్నారని అన్నారు. ఇదే తమ పార్టీకి బలమని జేపీ నడ్డా అభిప్రాయపడ్డారు. అందుకే దేశంలోని ఏ ఇతర రాజకీయ పార్టీ కూడా తమ పార్టీతో సరితూగలేదని, నిబద్ధత, ఐకమత్యంగా ఉండడమే తమ పార్టీ బలమని నొక్కిచెప్పారు. ఈ సందర్భంగా పార్టీలో ఎదుగుతున్న తీరును ఎప్పటికప్పుడు స్వయంగా అంచనా వేసుకోవాలని భాజపా కార్యకర్తలకు సూచించారు.
‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్’ అనేదే తమ పార్టీ విధానమన్న జేపీ నడ్డా, తమ ప్రభుత్వం అమలు చేసే అన్ని పథకాలు వీటి కోసమేనని అన్నారు. ఇక దేశంలోని అన్ని జిల్లాల్లో తమ పార్టీ కార్యాలయాలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని నడ్డా తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.