Opposition Meet: ‘450 స్థానాల్లో భాజపాపై ఒక్కరే పోటీ’.. విపక్షాల వ్యూహం ఇదేనా..?

Opposition Meet: ఈ నెల 23న పట్నా వేదికగా ప్రతిపక్షాల భేటీ జరగనుంది. బిహార్‌ సీఎం నీతీశ్ కుమార్‌ నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో కాంగ్రెస్‌, టీఎంసీ సహా పలు విపక్ష పార్టీల నేతలు పాల్గొననున్నారు. ఇందులో ప్రధానంగా వన్‌ టు వన్‌ ఫార్ములాపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Updated : 08 Jun 2023 15:39 IST

దిల్లీ: వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో (2024 Lok sabha elections) భాజపా (BJP)ను ఉమ్మడిగా ఎదుర్కొనే విషయంలో వ్యూహాన్ని రూపొందించడానికి ప్రతిపక్ష పార్టీలు ముహూర్తం ఖరారు చేశాయి. ఈ నెల 23న బిహార్‌లోని పట్నా వేదికగా విపక్ష నేతలు కీలక సమావేశం (Opposition Meet) నిర్వహించనున్నారు. ప్రధానంగా అభ్యర్థుల ఎంపికలో ఓ ముఖ్యమైన ఎజెండాపై ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అత్యధిక స్థానాల్లో భాజపాపై ద్విముఖ పోరుకు దిగాలని విపక్షాలు వ్యూహరచన చేస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో కనీసం 450 స్థానాల్లో ఈ ‘ద్విముఖ’ వ్యూహాన్ని అమలు చేయాలని విపక్షాలు భావిస్తున్నట్లు సమాచారం. అంటే.. ఈ స్థానాల్లో భాజపా (BJP) అభ్యర్థిపై ప్రతిపక్షాల్లో కేవలం ఒక పార్టీ నుంచే అభ్యర్థిని నిలబెడతారన్నమాట..! భాజపా వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. జూన్ 23న ఈ వ్యూహంపైనే ప్రధానంగా చర్చించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

వన్‌-టు-వన్‌ ఫార్ములా సాధ్యమేనా..?

ఈ వ్యూహంలో భాగంగా ప్రాంతీయ పార్టీలు (Regional Parties) తమకు బాగా పట్టున్న నియోజకవర్గాల్లో భాజపాపై నేరుగా బరిలోకి దిగుతాయి. ఇక జాతీయ పార్టీలు (National Parties).. అధికార భాజపాకు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్‌, ఆయా జాతీయ పార్టీల అభ్యర్థులను నిలబెట్టనున్నారు. ఈ ఫార్ములాను తొలుత తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి (TMC), పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే, ఆచరణలో ఇది సాధ్యమేనా? అన్నదే ఇక్కడ ప్రధాన సమస్య. ఎందుకంటే జాతీయ స్థాయిలో విపక్షాలైన రెండు పార్టీలు.. కొన్ని రాష్ట్రాల్లో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నాయి. దీంతో ఈ అంశంపైనా విపక్షాలు చర్చించనున్నట్లు సమాచారం.

పట్నానే ఎందుకు..?

విపక్షాల భేటీకి పట్నా (Patna)కు వేదికగా ఎంచుకున్నందుకు ఓ కారణం ఉంది. ఈ నగరం విపక్ష రాజకీయాలకు హబ్‌గా పేరొందింది. గతంలోనూ ఇక్కడ ప్రతిపక్షాల సమావేశం జరిగింది. ఎమర్జెన్సీ తర్వాత నాటి అధికార కాంగ్రెస్ (Congress) పాలనకు వ్యతిరేకంగా జయప్రకాశ్ నారాయణ్‌ నాయకత్వంలో ఆ భేటీ జరిగింది. అయితే ఈసారి భాజపాకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ సమావేశంలో కాంగ్రెస్‌ కూడా పాల్గొననుంది.

బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ నేతృత్వంలో జరిగే సమావేశానికి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ హాజరయ్యేందుకు అంగీకరించారు. ఇంకా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌, ఎన్సీపీ, శివసేన (యూబీటీ) అధినేతలు శరద్‌పవార్‌, ఉద్ధవ్‌ ఠాక్రే తదితరులు హాజరుకానున్నట్లు బిహార్‌ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌, జేడీయూ అధ్యక్షుడు రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ లలన్‌ బుధవారం విలేకరులకు వెల్లడించారు. సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ ప్రధాన కార్యదర్శులు డి.రాజా, సీతారాం ఏచూరి, దీపాంకర్‌లు కూడా ఈ భేటీలో పాల్గొననున్నట్లు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని