Andhra News: ఒక్కో ప్రమాదానికి ఒక్కోలా పరిహారం ఇవ్వడమేంటి?: పవన్‌ కల్యాణ్‌

ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్‌ రసాయన పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటన అత్యంత బాధాకరమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

Published : 14 Apr 2022 12:47 IST

అమరావతి: ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్‌ రసాయన పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటన అత్యంత బాధాకరమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు సజీవదహనం అయిన విషయం ఎంతో ఆవేదనకు గురిచేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్.. కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించాలన్నారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై పవన్‌ స్పందిస్తూ.. ఒక్కో ప్రమాదానికి ఒక్కోలా పరిహారం ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించి న్యాయబద్ధంగా పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రసాయన కర్మాగారాల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని.. అధికార యంత్రాంగం భద్రతా ప్రమాణాలపై నిరంతరం తనిఖీలు చేసి నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కోరారు.

మెరుగైన చికిత్స అందించాలి: సోము వీర్రాజు

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అక్కిరెడ్డిగూడెం ప్రమాద బాధితులను సోము పరామర్శించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని