Pawan Kalyan: బుగ్గలు నిమిరే వారిని కాదు.. మాటపై నిలబడే వారిని నమ్మండి: పవన్‌

రాజకీయాల్లో విలువలు నిలబెట్టేలా తాను మాట్లాడుతుంటే వైకాపా నేతలు దిగజారి మాట్లాడుతున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 09 Jul 2023 22:14 IST

ఏలూరు: రాజకీయాల్లో విలువలు నిలబెట్టేలా తాను మాట్లాడుతుంటే వైకాపా నేతలు దిగజారి మాట్లాడుతున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనను వ్యక్తిగతంగా దూషిస్తూ  .. జగన్‌ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.  జగన్‌ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడను కానీ.. ఇప్పటి నుంచి సీఎంను ఏకవచనంతో పిలుస్తానని ప్రకటించారు. వారాహి విజయయాత్ర రెండో విడత ఏలూరు నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పవన్‌ కల్యాణ్ మాట్లాడుతూ.. వైకాపా ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు.

‘‘రాష్ట్ర ప్రభుత్వ లోపాలను కాగ్‌ నివేదిక వెల్లడించింది. వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులను ఎక్కడ ఖర్చు చేశారు? రాష్ట్ర బడ్జెట్‌లో పదోవంతు అప్పులు తెచ్చారు. చేసిన అప్పులకు జగన్‌, మంత్రివర్గం జవాబు చెప్పాల్సిందే. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు. ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి చాలా కీలకం. విద్య, వైద్యం, ఉపాధి కల్పించే వరకు ప్రజలకు అండగా ఉంటాం. కొల్లేరు కలుషితమవుతోంది.. సంరక్షించే బాధ్యత మాది. 115 ఏళ్లనాటి కృష్ణా జ్యూట్‌మిల్లు మూసేస్తే ఎవరూ మాట్లాడలేదు. రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా జరుగుతోంది. మానవ అక్రమ రవాణాకు కారణం.. వైకాపా వాలంటీరు వ్యవస్థ. ఇందులో వైకాపా నేతల పాత్ర ఉందని నిఘా వర్గాలే చెప్పాయి. యువతుల అదృశ్యంపై ప్రభుత్వం ఎందుకు సమీక్ష చేయలేదు. మద్య పాన నిషేధం అన్నారు.. అమలు చేశారా?. సీఎం సహా ఒక్కో ఎమ్మెల్యే రూ.వందల కోట్లు దోచేస్తున్నారు. ఏలూరులో వరద వస్తే రక్షణ గోడలు లేవు. హలో ఏపీ.. బైబై వైసీపీ ఇదే మా నినాదం. దిగజారుడు రాజకీయాలు చేస్తున్న జగన్‌ ముఖ్యమంత్రి పదవికి అర్హుడు కాదు. పదవి నుంచి దిగిపోగానే జగన్‌ను వాడవాడలా వెంటాడతాం. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ ప్రభుత్వం మారాలి. బుగ్గలు నిమిరే వారిని కాదు.. మాటపై నిలబడే వారిని నమ్మండి’’ అని పవన్‌ కల్యాణ్ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని