Ajit Pawar: పవార్‌ సాహెబ్.. రాజీనామా వెనక్కి తీసుకోరు..!

ఎన్‌సీపీ పార్టీ అధ్యక్షుడిగా శరద్ పవార్‌(Sharad Pawar)రాజీనామాపై ఆయన సమీప బంధువు అజిత్ పవార్ స్పందించారు. పార్టీకి కొత్త అధ్యక్షులు ఎవరు వచ్చినా, పవార్ మార్గదర్శకత్వంలో పనిచేస్తారన్నారు. 

Published : 03 May 2023 01:05 IST

ముంబయి: ఎన్‌సీపీ(NCP) పార్టీ అధ్యక్ష పదవి నుంచి శరద్‌ పవార్‌(Sharad Pawar) వైదొలగడాన్ని పార్టీ వర్గాలు తట్టుకోలేకపోతున్నాయి. ఆయన వెంటనే రాజీనామా వెనక్కి తీసుకోవాలని ఎన్‌సీపీ కార్యకర్తలు, నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాజీనామా సమయంలో పక్కనే ఉన్న ఎమ్మెల్యే జయంత్‌ పాటిల్ వంటి నేతలు కన్నీటి పర్యంతమైన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. పవార్‌ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగిన ఆడిటోరియం నుంచి కొందరు బయటకు వెళ్లి, ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ పరిణామాలపై ఆ పార్టీ నేత అజిత్ పవార్‌(Ajit Pawar) స్పందించారు.

‘ఎన్‌సీపీ కుటుంబానికి ఎప్పుడూ పవార్‌ సాహెబ్‌ అధినేతగా ఉంటారు. పార్టీకి కొత్త అధ్యక్షుడు ఎవరు వచ్చినా.. పవార్‌ మార్గదర్శకత్వంలోనే పనిచేస్తారు.  పార్టీ నాయకత్వంలో మార్పు ఆవశ్యకత గురించి కొద్దిరోజుల క్రితమే ఆయన చెప్పారు. వయస్సు, ఆరోగ్యరీత్యా ఈ నిర్ణయం తీసుకున్నారని మనం గమనించాలి. సమయానుగుణంగా ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు సాహెబ్ చేసిందీ అదే. దానిని ఆయన వెనక్కి తీసుకోరు. ఒక అన్నగా ప్రస్తుత పరిణామంపై ఏమీ మాట్లాడొద్దని సుప్రియా సూలేకు సూచిస్తున్నాను’ అని అజిత్ అన్నారు. మరోపక్క రాజీనామాపై ఆమె శరద్ పవార్‌తో మాట్లాడాలని పార్టీ వర్గాలు కోరుతున్నాయి.

ఆవేదనలో ఉన్న కార్యకర్తలను ఉద్దేశించి శరద్ పవార్ మాట్లాడుతూ.. ‘నేను రాజకీయాల్లోనే ఉంటాను. అయితే ఎన్నికల్లో పోటీ చేయను. మనమంతా కలిసి పనిచేద్దాం. నా రాజీనామాను ఆమోదించండి’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని