TDP: రాయలసీమ వనరులను జగన్‌ ప్రభుత్వం ఏటీఎంలా వాడుకుంటోంది: పయ్యావుల కేశవ్‌

రాయలసీమ వనరులను జగన్‌ ప్రభుత్వం ఏటీఎంలా వాడుకుంటోందని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ ఆరోపించారు.

Updated : 14 Jul 2023 18:20 IST

అమరావతి: రాయలసీమ వనరులను జగన్‌ ప్రభుత్వం ఏటీఎంలా వాడుకుంటోందని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ ఆరోపించారు. రాయలసీమను అవినీతికోసం, దోపిడీ కోసం జగన్‌ ప్రభుత్వం వినియోగించుకుంటోందని ధ్వజమెత్తారు.  వైకాపా నేతల కోసమే అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోందని మండిపడ్డారు. ఇడుపులపాయలో అసైన్డ్‌ భూముల బాగోతంపై అసెంబ్లీలో ఏ స్థాయిలో చర్చ జరిగిందో అందరికీ తెలుసన్నారు. పేదల అసైన్డ్‌ భూములు ఇడుపుల పాయలో ఉన్నాయన్నారు.

ఇసుక తవ్వకాల్లో నెలకు రూ.300 కోట్ల దోపిడీ  యథేచ్ఛగా జరిగిందని,  తాడేపల్లి ఖజానాకు ఇసుక దోపిడీ సొమ్ము రూ.12వేల కోట్లు చేరాయని ఆరోపించారు. ఎన్జీటీ ఉత్తర్వులను జగన్‌ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. ఏపీలోని సామాన్యుడికి ఇసుక దొరకడం లేదని, పక్క రాష్ట్రాలకు మాత్రం భారీగా ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని దుయ్యబట్టారు. రాయలసీమ ప్రాజెక్టుల పేరుతో రూ.900 కోట్ల భారీ స్కామ్‌ జరిగిందని ఆరోపిస్తే.. ప్రభుత్వం స్పందించలేదని ఆక్షేపించారు. ప్రభుత్వ మౌనం.. స్కాం జరిగిందన్న ఆరోపణలకు అంగీకారాంగా భావించాలా అని ప్రశ్నించారు. పక్కదారి పట్టిన రూ.900 కోట్లు వినియోగిస్తే రాయలసీమ ప్రాజెక్టులు పూర్తయ్యేవన్నారు. కొట్టుకుపోయిన అన్నమయ్య, పులిచింతల గేట్లు బిగించగలిగేవారన్నారు. లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని పయ్యావుల కేశవ్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని