
Telangana : సీఎం సారూ..రజత్‌కుమార్ అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టారా? : రేవంత్
హైదరాబాద్: తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమాపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేయించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. రజత్ కుమార్, షెల్ కంపెనీల మధ్య ఆర్థిక లావాదేవీలపై న్యాయస్థానం పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ఇతర అధికారులతోపాటు, ప్రభుత్వంలోని పెద్దలపై వచ్చిన అవినీతి ఆరోపణలపైనా విచారణ జరిపించాలన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు. తన డిమాండ్లపై ముఖ్యమంత్రిగా కేసీఆర్ స్పందించకుంటే ఆయన వ్యవహార శైలిని ప్రజలు అనుమానించే పరిస్థితి వస్తుందని, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారం నిజమని నమ్మాల్సి వస్తుందని రేవంత్ వ్యాఖ్యానించారు.
గతేడాది డిసెంబర్‌లో రజత్‌కుమార్ కుమార్తె వివాహానికి అయ్యే ఖర్చును కొన్ని షెల్ కంపెనీలు భరించినట్లు, ఈ కంపెనీలకు కాళేశ్వరం ప్రాజెక్టు చేపడుతున్న ‘మేఘా’తో సంబంధాలున్నట్లు ఓ మీడియా సంస్థ (ఈనాడు కాదు) పరిశోధనాత్మక కథనం ప్రచురించింది. దీనిపై తాజాగా రేవంత్‌రెడ్డి స్పందించారు. ‘‘ముఖ్యమంత్రి హోదాలో సాగునీటి శాఖను మీరే నిర్వహిస్తున్నారు. ఆరోపణలు వచ్చిన సీనియర్ ఐఏఎస్ అధికారి రజత్‌కుమార్ మీ పర్యవేక్షణలోనే పని చేస్తున్నారు. ఆయనపై ఆరోపణలు వచ్చి రెండు రోజులు గడుస్తున్నా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎలాంటి స్పందనా లేదు. వివరణ ఇవ్వక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది’’ అని రేవంత్‌రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.