Sharad Pawar: వారి స్థానం ఏంటో చూపిస్తా.. పార్టీని పునర్నిర్మిస్తా: కార్యకర్తలతో ఉద్వేగంగా మాట్లాడిన పవార్‌

ఎన్‌సీపీలో అసమ్మతి అనంతరం ఆ పార్టీ అధ్యక్షుడు శరద్‌పవార్‌(Sharad Pawar) స్పందించారు. పార్టీ కార్యకర్తలతో ఉద్వేగభరితంగా మాట్లాడారు. 

Updated : 03 Jul 2023 15:05 IST

ముంబయి: ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌(Sharad Pawar)కు అజిత్ పవార్‌ షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం సతారా జిల్లాలోని కారాడ్‌లో పర్యటించిన శరద్ పవార్‌.. పార్టీపై తనకున్న పట్టును ప్రదర్శించారు. అక్కడికి వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి ఉద్వేగభరితంగా మాట్లాడారు. భాజపా అన్ని విపక్ష పార్టీలను ధ్వంసం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. పార్టీని పునర్నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఈ రోజు గురు పౌర్ణమి కావడంతో తన రాజకీయ గురువు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యశ్వంత్ రావ్‌ చవాన్‌ స్మారకాన్ని సందర్శించేందుకు అక్కడికి వెళ్లారు.  

‘ప్రస్తుతం మహారాష్ట్రలో.. అలాగే దేశంలో కులం, మతం పేరిట కొన్ని వర్గాలు విభేదాలు సృష్టిస్తున్నాయి. వాటిపై ఈ రోజు నుంచే నా పోరాటం మొదలవుతుంది. పార్టీని ముక్కలు చేయడానికి ప్రయత్నించిన వారికి వారి స్థానం ఏంటో చూపిస్తాం. ఇలాంటి అసమ్మతి వస్తూనే ఉంటుంది. కానీ వీటన్నింటిని దాటుకొని నేను పార్టీని పునర్నిర్మిస్తాను. పార్టీ అధ్యక్షుడిగా అది నా బాధ్యత’ అని వెల్లడించారు. అలాగే తమతో ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదని, పార్టీనే ముఖ్యమని అన్నారు. ఇతర పార్టీలను ముక్కలు చేయడానికి భాజపా విసిరే వలలో కొందరు పడిపోతారని అజిత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉంటే.. అజిత్‌ పవార్‌ (Ajit Pawar) మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో కలిసి అధికారపక్షంలో చేరారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం సైతం చేశారు. అయితే, అజిత్‌ వర్గానికి పార్టీ మద్దతు లేదని ఎన్సీపీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే అజిత్‌ పవార్‌ సహా తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు (Disqualification) వేయాలని కోరుతూ.. అసెంబ్లీ స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌ (Rahul Narwekar)ను ఎన్సీపీ అభ్యర్థించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని