Eknath Shinde: మాకు మాత్రం తలుపులు మూసివేశారు..

మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే శివసేన కార్యకర్తలను ఉద్దేశించి ఉద్వేగంతో మాట్లాడారు.

Published : 23 Jun 2022 15:28 IST

నిన్న మీ ఉద్వేగం కనిపించింది కానీ, సమాధానాలు రాలేదు: శిందే

ముంబయి: మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే శివసేన కార్యకర్తలను ఉద్దేశించి ఉద్వేగంతో మాట్లాడారు. అనంతరం అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. దీనిపై అసమ్మతి నేత ఏక్‌నాథ్ శిందే కౌంటర్ ఇచ్చారు. ‘ఇదీ వాస్తవ పరిస్థితి’ అంటూ ఎంవీఏ పాలనలో ఎదుర్కొన్న అవమానాలను ప్రస్తావించారు. అలాగే తాను తిరిగి రావాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి అసంతృప్త ఎమ్మెల్యేలు రాసిన మూడు పేజీల లేఖను ట్విటర్‌లో షేర్‌ చేశారు. 

‘రామ్‌ మందిరం, అయోధ్య, హిందుత్వ.. శివసేనకు సంబంధించినవి కావా..? శివసేన ఎమ్మెల్యేలు అయోధ్యకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆదిత్య ఠాక్రే ఒక్కరే వెళ్లారు. మిగిలినవారు వెళ్లడానికి ప్రయత్నిస్తే.. ఉద్ధవ్‌ స్వయంగా ఫోన్‌చేసి, అడ్డుకున్నారు. మరోపక్క, ఎన్‌సీపీ, కాంగ్రెస్ నేతల ముందు అధికారులు మాకు గౌరవం ఇవ్వడం లేదు. మమ్మల్ని అవమానించారు. ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ నేతలు మిమ్మల్ని కలవడానికి అనుమతి ఉంటుంది. మాకు మాత్రం తలుపులు మూసి ఉంటాయి. వారికి నిధులు అందుతున్నాయి. వారికెందుకు నిధులు వస్తున్నాయి, మనకెందుకు రావడం లేదని నియోజకవర్గంలోని ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏక్‌నాథ్‌ శిందే మాకు మద్దతుగా నిలిచారు. మీరు నిన్న మాట్లాడింది ఉద్వేగపూరితంగా ఉంది. కానీ మా ప్రశ్నలకు మాత్రం సమాధానాలు రాలేదు. మా ఆవేదన, అభిప్రాయాలు తెలియజేయడానికే ఈ లేఖ రాశాం’ అంటూ ఉద్ధవ్‌ వైఖరిని నిరసించారు. 

శివసేనకు అసెంబ్లీలో 55 మంది ఎమ్మెల్యే ఉన్నారని, అందులో 13 మంది మినహా అంతా తమ వర్గంలోకి వస్తారని శిందే ఇదివరకే ధీమా వ్యక్తం చేశారు. అలాగే శివసేన ఎన్నికల చిహ్నాన్ని శిందే వర్గం క్లెయిమ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 

తదుపరి పోరాటానికి సిద్ధంగా ఉండండి..: పవార్‌

ఈ రోజు ఉదయం ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ తన పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ‘ఈ అనిశ్చితి వేళ.. కఠిననిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌కు తెలియజేశాం. ఈ పరిస్థితుల్లో ఎన్‌సీపీ తోడుగా ఉంటుందని చెప్పాం. మనం అధికారం కోల్పోతే.. తదుపరి రాజకీయ పోరాటానికి కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలి’ అంటూ పవార్ వ్యాఖ్యానించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 

ఫడణవీస్‌ సీఎం అంటూ వెలిసిన పోస్టర్టు..

ఈ సంక్షోభం సమయంలో ఎంవీఏ అధికారం కోల్పోతే.. భాజపా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే మరోసారి దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. దీనిని ఉద్దేశించి.. ఔరంగాబాద్‌లోని ఆయన అనుచరులు ఫడణవీస్ సీఎం అని పోస్టర్ల రూపంలో తమ మద్దతు ప్రకటించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని