Maharashtra: ‘అధికారం కోసం ఎన్నటికీ మోసం చేయను’.. చర్చనీయాంశంగా షిండే ట్వీట్‌

మహారాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ షిండే, ఆయన అనుచరగణం అజ్ఞాతంలోకి వెళ్లడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

Published : 22 Jun 2022 01:03 IST

ట్విటర్‌ బయోలో శివసేన పేరు తొలగింపు

ముంబయి: మహారాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ షిండే, ఆయన అనుచరగణం అజ్ఞాతంలోకి వెళ్లడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ క్రమంలో షిండే ట్విటర్ వేదిక చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘మేం బాలాసాహెబ్‌కు చెందిన బలమైన సైనికులం. ఆయన మాకు హిందుత్వను నేర్పించారు. బాలాసాహేబ్, ఆనంద్ దిఘే బోధనలను పాటిస్తోన్న మేం అధికారం కోసం ఎన్నటికీ మోసానికి పాల్పడం’ అంటూ షిండే ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ చేసిన గంట సేపటికే ట్విటర్‌ బయోలో షిండే ‘శివసేన’ అనే పదాన్ని తొలగించడం గమనార్హం.

ఇదిలా ఉంటే.. తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి సొంత ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగరవేసేందుకు సిద్ధమైన షిండేపై శివసేన వేటు వేసింది. రాష్ట్ర అసెంబ్లీ పార్టీ శాసనసభా పక్షనేతగా ఆయన్ను తొలగించింది. ఆ స్థానంలో అజయ్ చౌధరీని నియమించింది. ప్రస్తుతం షిండే తన అనుచరులతో కలిసి గుజరాత్‌లోని సూరత్‌ హోటల్‌లో ఉన్నట్లు సమాచారం. ఆయనతో పాటు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, వారంతా భాజపాలో చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. లేదా కొత్త పార్టీ కూడా పెట్టే అంశంపైనా వార్తలు వినిపిస్తున్నాయి. 

ఠాణేలో శివసేన ముఖ్య నేత అయిన షిండే.. సంకీర్ణ ప్రభుత్వం(మహా వికాస్ అగాఢీ) తీరుతో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలతో సర్కారు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం కన్పిస్తోంది. మరోపక్క మహారాష్ట్రలో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కాంగ్రెస్ రంగంలోకి దిగింది. ఈ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు తమ తరఫున సీనియర్ నేత కమల్‌ నాథ్‌కు బాధ్యతలు అప్పగించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని