Mohammed Faizal: లక్షద్వీప్‌ ఎంపీ ఫైజల్‌కు సుప్రీంలో ఊరట.. మళ్లీ అనర్హత వేటు రద్దయ్యే అవకాశం!

లక్షద్వీప్‌ ఎంపీ మహమ్మద్‌ ఫైజల్‌కు సుప్రీంలో ఊరట లభించింది. దాంతో ఆయనపై రెండోసారి పడిన అనర్హత వేటు రద్దు అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. 

Published : 09 Oct 2023 18:21 IST

దిల్లీ: లక్షద్వీప్‌ ఎంపీ, ఎన్సీపీ నేత మహమ్మద్‌ ఫైజల్‌పై (Mohammed Faizal) నమోదైన హత్యాయత్నం కేసులో శిక్షను నిలిపివేసేందుకు కేరళ హైకోర్టు తిరస్కరించిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. దాంతో లోక్‌సభ సచివాలయం ఇటీవల ఆయనను ఎంపీగా అనర్హుడని ప్రకటిస్తూ జారీ చేసిన ఆదేశాలు రద్దు అయ్యే అవకాశం ఉంది. అక్టోబర్ 3న కేరళ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో.. ఆ మరుసటి రోజున లోక్‌సభ సచివాలయం విడుదల చేసిన ప్రకటన మేరకు సభ్యుడిగా ఆయన అనర్హుడయ్యారు. ఈ నేపథ్యంలో ఫైజల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్‌ హృశికేశ్‌ రాయ్‌, జస్టిస్‌ సంజయ్‌ కరోల్ ధర్మాసనం ఎదుట సీనియర్ న్యాయవాది కపిల్‌ సిబల్‌, అదనపు సొలిసిటర్‌ జనరల్ కేఎం నటరాజ్‌ వాదనలు వినిపించారు. ఫైజల్ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం ఫైజల్‌కు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

రాజస్థాన్‌ బరిలో ఏడుగురు భాజపా ఎంపీలు.. మధ్యప్రదేశ్‌ సీఎంకు సీటు ఫిక్స్‌

2009లో కాంగ్రెస్‌ నాయకుడు మహ్మద్‌ సలీహ్‌పై దాడి చేశారన్న కేసులో ఈ ఏడాది జనవరి 10న లక్షద్వీప్‌ ఎంపీ మహ్మద్‌ ఫైజల్‌ (Mohammad Faizal)ను కవరత్తీ సెషన్స్‌ కోర్టు దోషిగా తేల్చింది. పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. తీర్పు వెలువడిన మూడు రోజుల తర్వాత (జనవరి 13న) లోక్‌సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటు వేస్తూ ప్రకటన జారీ చేసింది. ఫైజల్‌ (Mohammad Faizal) కేరళ హైకోర్టును ఆశ్రయించడంతో... సెషన్స్‌ కోర్టు తీర్పు అమలును నిలిపివేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో ఆయనపై పడిన అనర్హత వేటు చెల్లుబాటు కాకుండా పోయింది. అయినప్పటికీ.. ఫైజల్‌ సభ్యత్వాన్ని లోక్‌సభ సచివాలయం పునరుద్ధరించలేదు. దీన్ని సవాల్‌ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఆ తరువాత ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడం గమనార్హం. ఆ తరువాత సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కేరళ హైకోర్టు ఫైజల్‌ పిటిషన్‌ను పునఃపరిశీలించింది. శిక్ష నిలిపివేసేందుకు నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని