Kollu Ravindra: సుబ్బారావు కుటుంబానిది వైకాపా ప్రభుత్వ హత్యే: కొల్లు రవీంద్ర

వైయస్‌ఆర్‌ జిల్లా కొత్త మాధవరంలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబాన్ని తెదేపా బృందం పరామర్శించింది.

Published : 25 Mar 2024 18:43 IST

ఒంటిమిట్ట: వైయస్‌ఆర్‌ జిల్లా కొత్త మాధవరంలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబాన్ని తెదేపా బృందం పరామర్శించింది. ఆర్థిక బాధలతో, వైకాపా ప్రభుత్వ అరాచకాలతో సుబ్బారావు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం ఎంతో బాధాకరమని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఇది ప్రభుత్వం చేసిన హత్యేనని ఆరోపించారు. ‘‘వారసత్వంగా వచ్చిన ఆస్తి పత్రాలను ఎమ్మార్వో కార్యాలయంలో తారుమారు చేశారు. జగన్‌ ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకొని బలహీన వర్గాలపై కుట్ర చేస్తోంది. సామాన్యుల ఆస్తులకు భద్రత లేదు. సుబ్బారావు కుటుంబ ఆత్మహత్యపై అధికారులెవరూ స్పందించలేదు. కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్‌ నిధులు సుబ్బారావు ఖాతాలో పడ్డాయి. ఆ భూమి సుబ్బారావు కుటుంబానిదే అనేందుకు ఇదే నిదర్శనం. తెదేపా కూటమి అధికారంలోకి రాగానే ఆ భూమిని ఆయన పెద్ద కూతురుకు అప్పగిస్తాం. చేనేత వృత్తుల వారికి భరోసా ఇస్తామని నమ్మించి వైకాపా ప్రభుత్వం మోసం చేసింది. కేంద్రం నుంచి రావాల్సిన ప్రోత్సాహకాలు అందకుండా చేశారు. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 55 ఏళ్లు నిండిన ప్రతి బీసీ సోదరుడికి ప్రతి నెలా రూ.4 వేల పింఛను అందజేస్తాం’’ అని రవీంద్ర తెలిపారు. 

సుబ్బారావు పెద్ద కుమార్తె నిత్యతో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఫోన్‌లో మాట్లాడారు. పార్టీ ఆమెకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తెదేపా తరపున ఎక్స్‌గ్రేషియా కింద రూ.10 లక్షలు అందజేశారు. ఇప్పటికే నిత్య స్థిరపడటానికి, పెళ్లి చేసే వరకు తాను బాధ్యతలు తీసుకుంటానని తెదేపా అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని