TDP: దమ్ముంటే సభలో జరిగిన పరిణామాలపై వీడియోలను బయటపెట్టాలి: తెదేపా ఎమ్మెల్యేలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో వైకాపాలో పిచ్చి పరాకాష్ఠకు చేరిందని తెదేపా(TDP) ఎమ్మెల్యేలు విమర్శించారు.

Updated : 20 Mar 2023 14:37 IST

అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో వైకాపాలో పిచ్చి పరాకాష్ఠకు చేరిందని తెదేపా(TDP) ఎమ్మెల్యేలు విమర్శించారు. అసెంబ్లీ(AP Assembly)లో తమ పార్టీ ఎమ్మెల్యేలు డోలా బాల వీరాంజనేయస్వామి, గోరంట్ల బుచ్చయ్యచౌదరిపై జరిగిన దాడి ఘటనలను వారు తీవ్రంగా ఖండించారు. సభ వాయిదా అనంతరం డోలా బాల వీరాంజనేయస్వామి, గోరంట్ల బుచ్చయ్యచౌదరితో పాటు మిగిలిన తెదేపా ఎమ్మెల్యేలు బెందాళం అశోక్‌, ఏలూరి సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. వైకాపా ప్రభుత్వానికి దమ్ముంటే సభలో జరిగిన పరిణామాలపై వీడియోలను బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు.

‘‘శాసనసభలో వైకాపా ఎమ్మెల్యేలు సుధాకర్‌బాబు, ఎలీజా నాపై దాడి చేశారు. స్పీకర్‌ పోడియం వద్ద నిరసన తెలుపుతుండగా దాడికి పాల్పడ్డారు. ఈ సంస్కృతి మంచిది కాదు. గౌరవ సభను కౌరవసభగా మార్చేశారు. సీఎం జగన్‌ దృష్టిలో పడాలనే ఉద్దేశంతోనే మాపై దాడి చేశారు. తిరిగి మేమే స్పీకర్‌పై దాడి చేసినట్లు మీడియా ముందు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీలో ఘటనలపై వీడియోలను ఎడిట్‌ చేయకుండా విడుదల చేయండి. స్పీకర్‌పై నేను అనుచితంగా ప్రవర్తించినట్లు రుజువైతే నాపై ఏ శిక్ష విధించినా దానికి కట్టుబడి ఉంటాను. ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఇది జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా గెలుపును పక్కదోవ పట్టించేందుకే ఇలా చేశారు. స్పీకర్‌ సమక్షంలోనే ఇది జరిగినందున నాపై దాడి చేసిన వారిపై ఆయన చర్యలు తీసుకోవాలి’’

- డోలా బాల వీరాంజనేయస్వామి


‘‘ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం మేం పోరాడుతున్నాం. జీవో నంబర్‌ 1పై రాష్ట్రవ్యాప్తంగా పోరాటం జరుగుతోంది. అందుకే దీనిపై సభలో వాయిదా తీర్మానం ఇచ్చి చర్చకు పట్టుబట్టాం. స్పీకర్‌ అనుమతించలేదు.దీంతో పోడియం వద్ద నిరసన తెలిపాం. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో వైకాపా నేతలు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు. అందుకే మతిభ్రమించి మాపై దాడి చేశారు. ఒక దళిత ఎమ్మెల్యేపై దాడి జరుగుతుంటే స్పీకర్‌ కనీసం పట్టించుకోలేదు. ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. మాకు మైక్‌ ఇవ్వకుండా నిరోధిస్తున్నారు. 40 ఏళ్లుగా శాసనసభకు వస్తున్నా.. ఏనాడూ ఇలాంటి ఘటనలు చూడలేదు. మంత్రి కారుమూరు నాగేశ్వరరావు, మాజీ మంత్రి వెలంపల్లి మాపై దాడికి రావడమేంటి? నేను పోడియం బయట ఉంటే వెలంపల్లి దూసుకొచ్చి నా చేతిలోని ప్లకార్డులు లాక్కొని పచ్చి బూతులు మాట్లాడారు. దాడులు చేయమని సీఎం వారిని ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రంలోని పరిస్థితి వాళ్లకి అర్థమవుతోంది. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు’’

- గోరంట్ల బుచ్చయ్య చౌదరి


‘‘ప్రజాస్వామ్యంలో ఇది బ్లాక్‌ డే. బ్రిటిష్‌ కాలం నాటి జీవో నంబర్‌1పై వాయిదా తీర్మానం ఇస్తే చర్చ చేపట్టలేదు. సీఎం జగన్‌ తన రక్షణ కోసం తీసుకొచ్చిన జీవో అది. దళిత ఎమ్మెల్యే ప్లకార్డు పట్టుకుని నిరసన తెలిపితే.. స్పీకర్‌ దాన్ని పక్కకు నెట్టేశారు. తిరిగి మేం దాడి చేశామని వైకాపా ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ప్రజాసమస్యలపై ప్రతిపక్ష పార్టీల సభ్యులు పోడియం వద్ద నిరసన తెలుపుతారు. అధికార పార్టీ సభ్యులు అక్కడికి రావాల్సిన అవసరమేంటి?స్పీకర్‌ మీన మేషాలు లెక్కించకుండా దీనిపై సమాధానం చెప్పాలి. ముందస్తు ప్రణాళికతోనే ఈ దాడి జరిగింది. దీనిపై ప్రజలకు వైకాపా సమాధానం చెప్పాల్సిన అవసరముంది. అసెంబ్లీలో జరిగిన ఘటనల వీడియోలను యథాతథంగా విడుదల చేయాలి’’

- బెందాళం అశోక్‌


‘‘ఈరోజు దుర్దినం. మా పార్టీకి చెందిన డోలా బాల వీరాంజనేయస్వామిపై భౌతికదాడి అమానుషం. జీవో నంబర్‌ 1పై వాయిదా తీర్మానం ఇచ్చి చర్చ చేపట్టాలని కోరాం. ఈ క్రమంలో స్వామిపై సంతనూతలపాడు, చింతలపూడి ఎమ్మెల్యేలు సుధాకర్‌, ఎలీజా దాడి చేశారు. ఇలాంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా ఉండటం సిగ్గుచేటు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా దారుణంగా ప్రవర్తించారు. ప్రేక్షకపాత్ర వహించిన స్పీకర్‌ ఆ పదవికి అనర్హుడు. మేమేం దాడి చేశామని ఆరోపిస్తున్న అధికార పార్టీ.. సభలో జరిగిన గందరగోళంపై వీడియోలను బయటపెట్టాలి. అప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి’’

- ఏలూరి సాంబశివరావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని