TDP: హైదరాబాద్‌ నుంచి ఖమ్మం సభకు చంద్రబాబు.. తెదేపా శ్రేణుల భారీ వాహన ర్యాలీ

ఖమ్మంలో నిర్వహించనున్న తెదేపా శంఖారావానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు సహా నేతలు, కార్యకర్తలు తరలివెళ్లారు.

Updated : 21 Dec 2022 13:54 IST

హైదరాబాద్‌: ఖమ్మంలో నిర్వహించనున్న తెదేపా శంఖారావానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు సహా నేతలు, కార్యకర్తలు తరలివెళ్లారు. తొలుత హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి బయల్దేరిన తెదేపా అధినేత.. నగరంలోని రసూల్‌పురా కూడలిలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ వాహన ర్యాలీతో ఖమ్మం వెళ్లారు. బేగంపేట, ఉప్పల్‌, నాగోల్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌ మీదుగా ఖమ్మం వైపు తెదేపా ర్యాలీ కొనసాగింది. మార్గంమధ్యలో స్థానిక నేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. 

ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ మైదానం వేదికగా బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ తెలంగాణ కొత్త అధ్యక్షుడి కాసాని జ్ఞానేశ్వర్‌ నియామకం తర్వాత తొలిసారి జరిగే సభను తెదేపా నాయకులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. భారీ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, జెండాలతో ఖమ్మం నగరం పసుపుమయంగా మారింది. ఖమ్మం నగరంలోని వరంగల్‌ క్రాస్‌ రోడ్డు వద్ద భారీ ద్విచక్రవాహన ర్యాలీతో అధినేతకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలకనున్నారు. మయూరి సెంటర్‌ నుంచి ఓపెన్‌ టాప్‌ వాహనంలో చంద్రబాబు అభివాదం చేస్తూ ముందుకు సాగుతారు. అక్కడి నుంచి బహిరంగ సభాస్థలికి చేరుకుని పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని