Anam: జగన్‌ లక్కీ నంబర్‌ లక్ష: తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డి

సాక్షి టీవీ తనది కాదంటూ సీఎం జగన్నాటకాలు ఆడుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు.

Updated : 30 Jan 2024 12:23 IST

నెల్లూరు: సాక్షి టీవీ తనది కాదంటూ సీఎం జగన్నాటకాలు ఆడుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు. అసలు సాక్షి సంగతే తనకు తెలియదన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

జగన్‌ లక్కీ నంబర్‌ లక్ష అని చెప్పిన ఆనం.. రూ. లక్షతో ఆయన పెట్టిన కంపెనీలన్నీ వేల కోట్లకు చేరుకున్నాయని ఆరోపించారు. జగతి పబ్లికేషన్స్‌ కూడా రూ. లక్ష పెట్టుబడితో పెట్టిందేనని తెలిపారు. ఇందులో రూ. 35వేలు విజయసాయిరెడ్డి, జె. జగన్‌మోహన్‌రెడ్డి రూ.30 వేలు, కామత్‌ అనే మరో వ్యక్తి రూ.35 వేలు పెట్టుబడి పెట్టారని చెప్పారు.

తొలుత విజయసాయిరెడ్డి సాక్షిలో డైరెక్టర్‌గా ఉన్నారని ఆనం తెలిపారు. ఆయన రాజీనామా చేయగానే జగన్‌ డైరెక్టర్‌ అయ్యారని.. ప్రస్తుతం ఆయన సతీమణి భారతీరెడ్డి కొనసాగుతున్నారని చెప్పారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఆ సంస్థకు డైరెక్టర్‌గా పని చేశారన్నారు. వీళ్లంతా డైరెక్టర్లుగా ఉంటే జగన్‌కు సంబంధం లేదా?అని ప్రశ్నించారు. ‘‘లక్ష రూపాయల కంపెనీలు రూ. వేల కోట్లుగా మారాయి. వైఎస్‌ కుటుంబం మొత్తానికి సాక్షిలో వాటాలు ఉన్నాయి. తనకేమీ సంబంధం లేనట్లు జగన్‌ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు’’ అని ఆనం మండిపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని