Parliament: 30 ఏళ్లలో ఇటువంటి ఘటనలు చూడలేదు..!

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో భాగంగా సభలో చోటుచేసుకున్న ఘటనలపై మాజీ ప్రధానమంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు హెచ్‌డీ దేవెగౌడ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 23 Aug 2021 01:19 IST

మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ

బెంగళూరు: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో భాగంగా సభలో చోటుచేసుకున్న ఘటనలపై మాజీ ప్రధానమంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు హెచ్‌డీ దేవెగౌడ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభలో చోటుచేసుకున్న సంఘటనలను తన 30ఏళ్ల పార్లమెంటేరియన్‌ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. ప్రజా సమస్యలపై ఎలాంటి చర్చ లేకుండా పార్లమెంటు ముగియడం, ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరుపై దేవెగౌడ మండిపడ్డారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత, ప్రతిపక్షాలను కలిశానని.. ప్రజా సమస్యలపై చర్చ జరగనీయకుండా సాధించింది ఏంటని వారిని ప్రశ్నించినట్లు దేవెగౌడ వెల్లడించారు.

వారి ప్రవర్తనపై ఆవేదన..

‘వర్షాకాల సమావేశాల్లో అధికార, విపక్ష సభ్యుల ఆందోళనల కారణంగా సభలో తాను మాట్లాడడానికి అనుమతి లభించలేదు. ఎటువంటి చర్చలు లేకుండానే సమావేశాలు ముగిశాయి. దీంతో విలువైన సభా సమయం వృథా అయ్యింది’ అని బెంగళూరులోని జేడీ(ఎస్‌) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హెచ్‌డీ దేవెగౌడ పేర్కొన్నారు.  వెల్‌లోని దూసుకెళ్లి.. టేబుళ్ల మీద నిలబడటం.. ఘటనలు తన 30ఏళ్ల పార్లమెంటేరియన్‌ జీవితంలో ఎన్నడూ చూడలేదని జేడీ(ఎస్‌) నేత దేవెగౌడ వాపోయారు. అటువంటి ప్రవర్తన సమాజానికి మంచిది కావని.. అవి ప్రజాస్వామ్య విలువలను దిగజార్చడాన్ని చూపిస్తాయన్నారు. అంతేకాకుండా స్వాతంత్ర్యం కోసం పోరాడిన గొప్ప నాయకులకు అవమానించినట్లేనని మాజీ ప్రధాని దేవెగౌడ అభిప్రాయపడ్డారు.

రాహుల్‌ గాంధీ మరిన్ని నైపుణ్యాలు పెంచుకోవాలి..

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపైనా మాజీ ప్రధాని స్పందించారు. తన రాజకీయ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి రాహుల్‌ గాంధీ మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ ఇటీవల ఆయన సైకిల్‌ ర్యాలీలో పాల్గొని ఏమి సాధించారన్నారు. ఇక ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రిని కలవడంపై విలేకరులు ప్రశ్నించగా.. వివిధ సమస్యలపై మద్దతు ఇస్తాననే హామీ ఇచ్చినట్లు దేవెగౌడ వెల్లడించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని