Ts News: దళితబంధును ఆపింది ముమ్మాటికీ భాజపా నేతలే: హరీశ్‌రావు

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తెరాసదే విజయమని అన్ని సర్వేలు చెబుతున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఓటమి ఖాయమని

Updated : 24 Sep 2022 14:20 IST

హుజూరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తెరాసదే విజయమని అన్ని సర్వేలు చెబుతున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఓటమి ఖాయమని తెలిసే విపక్షాలు తెరాసపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సంక్షేమ పథకాలే తెరాసకు విజయాన్ని అందిస్తాయన్నారు. గోబెల్స్‌ ప్రచారంతో గెలవాలని భాజపా యత్నిస్తోందని విమర్శించారు. ఇవాళ్టితో ఉప ఎన్నిక ప్రచార గడువు ముగియడంతో హుజూరాబాద్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.

‘‘2001 నుంచి తెరాస విజయబావుటా కొనసాగుతోంది. రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, పింఛన్లను మేం నమ్ముకున్నాం. కేంద్ర నిధులపై తెరాస విసిరిన సవాలుకు భాజపా నేతల వద్ద సమాధానం లేదు. ఇవాళ లీటర్‌ డీజిల్‌పై కేంద్రం రూ.31 వసూలు చేస్తోంది. యూపీఏ పాలనలో చమురుపై కేంద్రం పన్ను రూ.4 మాత్రమే ఉండేది. పెట్రోల్‌, డీజిల్‌ ధరను భాజపా తగ్గిస్తుందా?ఏడేళ్లలో రాష్ట్రానికి భాజపా ఏం చేసిందో ఆ పార్టీ నేతలు చెప్పాలి. దళితబంధును ఆపింది ముమ్మాటికీ భాజపా నేతలే. ధళితబంధుపై ప్రేమేందర్‌ రెడ్డి ఈసీకి లేఖ రాశారు. ప్రజా సమస్యలపై భాజపా నేతలు ఎప్పుడైనా చర్చించారా? విద్వేషాలు రెచ్చగొట్టి గెలవాలనేది భాజపా ఉద్దేశం. సాగు చట్టాలు రద్దు చేయాలని ఏడాదిగా రైతులు పోరాడుతున్నారు. ధర్నా చేస్తున్న రైతులను కేంద్ర మంత్రి కుమారుడు కారుతో తొక్కించారు. రైతుల చావుకు కారణమైన కేంద్ర మంత్రిపై ఇప్పటికీ చర్యల తీసుకోలేదు. ధర్నా చేస్తున్న రైతులను కొట్టాలని ఒక భాజపా సీఎం పిలుపునిచ్చారు. రైతులను కారుతో తొక్కించిన చరిత్ర భాజపాది. త్వరలోనే భాజపా నెత్తిన గ్యాస్ బండ పడటం ఖాయం’’ అని హరీశ్‌రావు తెలిపారు.

పన్నుల వాతలు.. రాయితీల కోతలు..

‘‘రైతులు కారు కొనుక్కునే స్థితికి ఎదగాలనేది మా లక్ష్యం. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించి రైతులను చంపాలని భాజపా చూస్తోంది. భాజపా నేతలు ఎన్నికల సమయంలోనే ఎస్సీల ఇళ్లల్లో భోజనం చేస్తారు. ఎన్నికలు లేనప్పుడు మేం ఎస్పీల కోసం పథకాలు అమలు చేశాం. పసుపు బోర్డు తెస్తానని బాండ్‌ పేపర్‌ రాసిచ్చిన నేత ఏం చేశారు?తెరాస పాలన పేదలకు పంచితే.. భాజపా పాలన పేదలను దంచింది. భాజపా పాలన అంతా రాయితీల కోతలు, పన్నుల వాతలు అనేదిగా ఉంది. ఈటలను తెరాస ఆరు సార్లు ఎమ్మెల్యేను చేసింది. రెండు సార్లు మంత్రిని చేసింది. పేదల అసైన్డ్‌ భూములను కబ్జా చేసినప్పుడే ఈటల ఆత్మగౌరవం పోయింది’’ అని అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని