Ts News: బెయిల్‌ నిరాకరణ.. బండి సంజయ్‌కి 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌

తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317జీవోకు నిరసనగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన దీక్షను నిన్న రాత్రి పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. 317జీవోకు నిరసనగా బండి సంజయ్‌ చేపట్టిన దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయన్ను మానకొండూర్‌ నుంచి కరీంనగర్‌లోని పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కు తరలించారు. అనంతరం....

Updated : 03 Jan 2022 16:20 IST

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317జీవోకు నిరసనగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన దీక్షను నిన్న రాత్రి పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. అనంతరం పోలీసులు ఆయన్ను మానకొండూర్‌ నుంచి కరీంనగర్‌లోని పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కు తరలించారు. ఇవాళ కరీంనగర్‌ కోర్టులో హాజరుపరిచారు. విధులకు ఆటంకం కలిగించారని సంజయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. బండి సంజయ్‌ తరఫున బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన భాజపా లీగల్‌ సెల్‌.. ఆయనపై పోలీసులు నమోదు చేసిన ఐపీసీ 353 సెక్షన్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది. గతంలో బండి సంజయ్‌పై నమోదైన కేసులను పోలీసులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆయనపై నమోదైన 10 కేసులు రిమాండ్ రిపోర్టులో పోలీసులు ప్రస్తావించారు.

ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం బండి సంజయ్‌ బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. బండి సంజయ్‌పై పోలీసులు మొత్తంగా 2 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. రెండో ఎఫ్‌ఐఆర్ ఆధారంగా బండి సంజయ్‌ సహా ఐదుగురికి 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. కోర్టు తీర్పు అనంతరం వారిని కరీంనగర్‌ జైలుకు తరలించారు. బెయిల్‌ కోసం బండి సంజయ్‌ జిల్లా కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం. అయితే జైలులో బండి సంజయ్‌కి అందించే ఆహారాన్ని జైలర్‌ రుచి చూశాకే ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. దీనిపై న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది.

బండి సంజయ్‌ అరెస్టు తీరు దారుణం: జేపీ నడ్డా

భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని అరెస్టు చేసిన తీరు దారుణంగా ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. తలుపులు పగులగొట్టి, భౌతికంగా దాడి చేశారని ఆరోపించారు. సొంత కార్యాలయంలో దీక్ష చేస్తున్నా.. సాకులతో అరెస్టు చేశారని మండిపడ్డారు. బండి సంజయ్‌ అరెస్టు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆక్షేపించారు. వినాశకాలే విపరీత బుద్ధి అనేలా కేసీఆర్‌ సర్కార్‌ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఉపాధ్యాయుల తరఫున భాజపా పోరాటం కొనసాగుతుందని నడ్డా వెల్లడించారు. సత్యం కోసం పోరాడతాం.. కేసీఆర్‌ను ఓడిస్తామని పునరుద్ఘాటించారు. కేసీఆర్‌ సర్కార్‌పై న్యాయపోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.

అసలేంటీ జీవో నెం.317.. ఎందుకు ఆందోళన

సర్దుబాటు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియపై గందరగోళం నెలకొంది. సీనియారిటీ ప్రాతిపదికన బదలాయింపు చేస్తామని ప్రభుత్వం చెప్పడంతో జూనియర్‌ టీచర్లు సొంత జిల్లా వదిలి వెళ్లాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. స్థానికతనే ప్రామాణికంగా తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.317 ప్రకారం ఉమ్మడి జిల్లాలో సర్వీస్‌ సీనియారిటీని పరిగణనలోకి తీసుకొని ఉపాధ్యాయుల్ని బదలాయిస్తారు. స్థానికేతర కోటాలో నియామకం జరిగినా సీనియారిటీ ప్రకారం అదే జిల్లాలో ఉండవచ్చు. స్థానికుడైనా జూనియర్‌ అయితే కొత్త జిల్లాకు వెళ్లాల్సి ఉంది. సాధారణ బదిలీలు అయితే కొద్దికాలం తరువాత అయినా తిరిగి సొంత ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది. వీటిల్లో మళ్లీ తిరిగి వచ్చే అవకాశం లేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని