వైఎస్‌ తెలంగాణ వ్యతిరేకి కాదు: షర్మిల

దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పరిస్థితులు లేవని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు...

Updated : 16 Jul 2021 14:40 IST

హైదరాబాద్‌: దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పరిస్థితులు లేవని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకే పార్టీ పెట్టానని చెప్పారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వైఎస్‌ తెలంగాణ వ్యతిరేకి కాదని.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అంశాన్ని యూపీఏ మేనిఫెస్టోలో చేర్చింది ఆయనేనని చెప్పారు. రాష్ట్ర ప్రజలను వైఎస్‌ గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారన్నారు. ఆయన మరణం తర్వాత తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలైందని చెప్పారు.

జగన్‌పై అలిగి పార్టీ పెట్టాననడం సరికాదు..

‘‘ఉద్యమంలో పాల్గొనకపోతే తెలంగాణపై ప్రేమ లేనట్లేనా? తెలంగాణకు వ్యతిరేకమని నేనెప్పుడూ చెప్పలేదు. సీఎం కేసీఆర్‌ మహిళలకు విలువ ఇవ్వరు. తెరాసలో మహిళలకు గౌరవం ఉండదు. మహిళలంటే వ్రతాలే చేసుకోవాలని కేటీఆర్‌ అంటున్నారు.. నిరుద్యోగుల కోసం నేను వ్రతమే చేస్తున్నా. ఏపీ సీఎం జగన్‌పై అలిగి నేను పార్టీ పెట్టాననడం సరికాదు. అలిగితే మాట్లాడటం మానేస్తారు.. పార్టీలు పెట్టరు. ఏపీలో రాజన్న రాజ్యం వస్తున్నట్లే కనిపిస్తోంది. రాజన్న రాజ్యం రాకుంటే ప్రజలే తిరగబడతారు. జగన్‌, నేను రెండు ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం. మా పరిధులకు కట్టుబడి ఉన్నాం.

సీఎంగా కేసీఆర్‌ విఫలం

కేసీఆర్‌ ఒక నియంత.. ఎవరూ ప్రశ్నించొద్దని అనుకుంటారు. ఆయన పాలనలో జనం ఇబ్బందులు చూడలేక.. ప్రజల బాగోగుల కోసమే పార్టీ పెట్టా. సీఎంగా కేసీఆర్‌ విఫలమయ్యారు. వచ్చిన అవకాశాన్ని ఆయన దుర్వినియోగం చేశారు. ఉద్యమకారుడిగా కేసీఆర్‌పై నాకెంతో గౌరవం ఉంది.. సీఎం అయ్యాక ఆయనలోని దొర బయటకొచ్చారు. పార్టీ అంటే వ్యక్తికాదు.. ప్రజలు, వ్యవస్థ. నేను ఉన్నా లేకున్నా పార్టీ కొనసాగుతుంది. ఒంటరినని భయపడను.. బాధ లేదు. రాసిపెట్టుకోండి.. ప్రభంజనం సృష్టిస్తాం. హుజూరాబాద్‌ ఉపఎన్నికకు అర్థమే లేదు.  ఈ ఎన్నికతో ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా? పగలు, ప్రతీకారాల కోసం ఉపఎన్నిక వచ్చింది. వైఎస్‌లాగే నేను కూడా చేవెళ్ల నుంచే పాదయాత్ర ప్రారంభిస్తా’’ అని షర్మిల చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని