CPM-Congress: సీపీఎంతో పొత్తుకు చివరి వరకు ప్రయత్నిస్తాం: కాంగ్రెస్‌

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో సీపీఎంతో పొత్తు కొనసాగించాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. అందుకే మిర్యాలగూడ, వైరా స్థానాలను పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.

Updated : 06 Nov 2023 22:21 IST

హైదరాబాద్‌: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో సీపీఎంతో పొత్తు కొనసాగించాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. ఇప్పటికే కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి కేటాయించిన కాంగ్రెస్.. మిర్యాలగూడ, వైరా స్థానాలను సీపీఎం కోసం పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. సీట్ల కేటాయింపు విషయంలో ఆ రెండు పార్టీల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పొత్తుల్లేకుండానే బరిలోకి దిగుతున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇటీవల ప్రకటించారు.  మొత్తం 24 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు చెప్పారు. 14 స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించారు.

అసెంబ్లీ ఎన్నికలు.. సీపీఎం రెండో జాబితా విడుదల

తాజా పరిస్థితుల నేపథ్యంలో చివరి వరకు సీపీఎంతో పొత్తుకోసం ప్రయత్నిస్తామని కాంగ్రెస్‌ వెల్లడించడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌ వైఖరిపై వీరభద్రం ఇటీవల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భద్రాచలం, పాలేరు, వైరా స్థానాలను ఇవ్వాలని అడిగితే కాంగ్రెస్‌ నిరాకరించిందని, వైరా, మిర్యాలగూడ ఇస్తామని చెప్పిందని ఆయన అన్నారు. ఆ తర్వాత వైరా కూడా ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తూ.. మిర్యాలగూడతోపాటు హైదరాబాద్‌లో ఓ స్థానాన్ని ఇస్తామని చెప్పారని ఈ క్రమంలోనే వాళ్లతో పొత్తు పెట్టుకోవడం లేదని మీడియాకు తెలిపారు. ఒకవేళ మిర్యాలగూడ, వైరా స్థానాలను కేటాయిస్తే.. సీపీఎం పొత్తుకు సిద్ధమవుతుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని