Himanta Biswa Sarma: అన్ని మదర్సాలూ మూసేస్తాం.. అస్సాం సీఎం వ్యాఖ్యలు

Himanta Biswa Sarma on madrasas: అస్సాంలో ఉన్న మదర్సాలన్నింటినీ మూసివేయాలని తాను అనుకుంటున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు.

Published : 18 Mar 2023 01:54 IST

బెళగావి: అస్సాం ముఖ్యమంత్రి, భాజపా నేత హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) కీలక వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలో ఉన్న మదర్సాలన్నింటినీ (madrasas) పూర్తిగా మూసివేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ‘నవ భారతం’లో మదర్సాలు అవసరం లేదన్నారు. ప్రస్తుతం కర్ణాటక ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ఆయన గురువారం రాత్రి జరిగిన ఓ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.

బంగ్లాదేశ్‌ నుంచి అస్సాంకు ఎక్కువ మంది వలస వస్తుంటారని, దీంతో రాష్ట్రంలో స్థానిక సంస్కృతి, సంప్రదాయాలకు ముప్పు వాటిల్లుతోందని చెప్పారు. ‘‘ఇటీవల దిల్లీలో ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ.. అస్సాంలో ఉన్న 600 మదర్సాలను మూసేయాలనుకుంటున్నట్లు చెప్పాను. వాస్తవంలో అన్ని మదర్సాలనూ మూసివేయాలన్నదే నా ఉద్దేశం’’ అని హిమంత అన్నారు. దేశానికి, రాష్ట్రానికి సేవ చేయడానికి స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు కావాలి తప్ప మదర్సాల అవసరం లేదని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు చరిత్రను వక్రీకరించి, అసత్యాలతో నింపేశారని హిమంత బిశ్వశర్మ ఆరోపించారు. 17వ శతాబ్దంలో మొఘల్‌ చక్రవర్తి ఔరంగ జేబు హిందూయిజాన్ని నాశనం చేయాలని చూస్తే.. ఛత్రపతి శివాజీ మాత్రం సనాతన ధర్మాన్ని, సంప్రదాయాలను రక్షించారన్నారు. దేశం మొత్తాన్ని ఔరంగ జేబు పాలించాడని కమ్యూనిస్టు చరిత్రకారులు రాశారని, వాస్తవంలో ఈశాన్య, దక్షిణ భారత రాష్ట్రాలు ఎప్పుడూ ఆయన పాలనలో లేవని చెప్పారు. ఇలా వక్రీకరణకు గురైన చరిత్రను తిరగ రాలయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఔరంగజేబు కంటే శివాజీ శక్తిమంతుడు అనే విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఒకప్పుడు మొఘల్‌ చక్రవర్తులు చేసిన పనే ఇప్పటి కాంగ్రెస్‌ చేస్తోందని, దేశాన్ని బలహీన పరుస్తోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ను ‘కొత్త మొఘలులు’గా అభివర్ణించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని