Yadlapati: పార్టీ మారాలని ఎన్టీఆర్‌ చెప్పలేదు కదా.. అంగీకరించండి..!

సోమవారం ఉదయం కన్నుమూసిన రాజకీయ కురువృద్ధుడు, తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు నైతిక విలువలతో కూడిన జీవితాన్ని గడిపారు. న్యాయవాదిగా, రైతు నేతగా, ప్రజాప్రతినిధిగా.. ఇలా ఎన్నో విధాలుగా ఆయన సేవలందించారు. ప్రముఖ రైతు...

Updated : 28 Feb 2022 18:38 IST

అమరావతి: సోమవారం ఉదయం కన్నుమూసిన రాజకీయ కురువృద్ధుడు, తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు నైతిక విలువలతో కూడిన జీవితాన్ని గడిపారు. న్యాయవాదిగా, రైతు నేతగా, ప్రజాప్రతినిధిగా.. ఇలా ఎన్నో విధాలుగా ఆయన సేవలందించారు. ప్రముఖ రైతు నాయకుడు ఎన్జీ రంగా ముఖ్య అనుచరుడిగానూ కొనసాగారు. కృషికార్‌ లోక్‌పార్టీ ఏర్పాటు సమయంలో యడ్లపాటి వెంకట్రావు కీలకంగా వ్యవహరించారు. యడ్లపాటి మృతి నేపథ్యంలో ఆయన అందించిన సేవలను పలువురు గుర్తు చేసుకుంటున్నారు. 2019లో ఈటీవీలో ప్రసారమైన ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమంలో యడ్లపాటి వెంకట్రావు తన జీవిత విశేషాలు, రాజకీయ ప్రస్థానాన్ని పంచుకున్నారు.

స్వతంత్ర పార్టీ, కాంగ్రెస్‌, తెదేపాల్లో రాజకీయ ప్రస్థానం.. అప్పటి పరిస్థితులను యడ్లపాటి వివరించారు. తాను చేసిన రైతు పోరాటాలు.. అప్పటి సీఎం ఎన్టీఆర్‌, ఆ తర్వాత చంద్రబాబుతో ఉన్న అనుబంధాన్ని తెలిపారు. అప్పట్లో జరిగిన కొన్ని సంఘటనలు.. ముఖ్యంగా ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు రైతుల కోసం ‘కర్షక పరిషత్‌’ ఏర్పాటు సమయంలో జరిగిన ఆసక్తికర విషయాలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. 1983లో తెదేపా అధికారంలోకి వచ్చేనాటికి తాను కాంగ్రెస్‌లో ఉన్నానని.. కర్షక పరిషత్‌లో చేరమని ఎన్టీఆర్‌ కోరితే తొలుత తాను తిరస్కరించానని చెప్పారు. నైతిక విలువలు ఉన్న వ్యక్తినని.. ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీకి చెందిన ప్రభుత్వంలోని పదవులు వద్దని చెప్పానన్నారు. ఈ విషయంపై ఎన్టీఆర్‌కు లేఖ కూడా రాశానని తెలిపారు. అయితే ఎన్టీఆర్ కూడా తిరిగి ఏడు పేజీల లేఖను తనకు పంపారన్నారు. ఈ రోజుల్లోనూ విలువలకు కట్టుబడి ఉన్న మనుషులు ఉండటం అరుదు అని ఎన్టీఆర్‌ అందులో పేర్కొన్నారని చెప్పారు. కాంగ్రెస్‌లో కొనసాగుతున్నా పర్లేదని.. నైతిక విలువలు, వ్యవసాయం పట్ల పూర్తి అవగాహన ఉన్న తనకు అవకాశమిస్తానంటూ కర్షక పరిషత్‌లో చేరమని ఎన్టీఆర్‌ తనను కోరారని యడ్లపాటి వివరించారు. ఆ తర్వాత ఇదే విషయాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత బలరామ్‌ జాకడ్‌ దృష్టికి తీసుకెళితే ‘పార్టీ మారాలని ఎన్టీఆర్‌ చెప్పలేదు కదా.. అంగీకరించండి’ అని తనకు సూచించారని చెప్పారు. ఆ విధంగా తాను అంగీకరిస్తేనే కర్షక పరిషత్‌లో సభ్యుడిగా చేరానని వివరించారు.

1983 ఎన్నికల్లో తాను, చంద్రబాబు కాంగ్రెస్‌ నుంచే పోటీ చేశామని యడ్లపాటి వెంకట్రావు పేర్కొన్నారు. చంద్రబాబు ఎమ్మెల్యేగా పోటీ చేసే సమయంలో ఆయనకు ఒకసారి బీఫామ్‌ తానే ఇచ్చానని గుర్తు చేసుకున్నారు. మర్రి చెన్నారెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో హైదరాబాద్‌లోని రంగా భవన్‌లో సమావేశం జరుగుతుండగా చిత్తూరుకు చెందిన రాజగోపాలనాయుడు చంద్రబాబును అక్కడికి తీసుకొచ్చారని చెప్పారు. యూనివర్సిటీ స్టూడెంట్‌ లీడర్‌ అని.. ఎమ్మెల్యే సీటిస్తే బాగుంటుందని ఆయన చెప్పారన్నారు. అలా ఆయన సూచన మేరకు తన చేతుల మీదుగానే చంద్రబాబుకు బీఫామ్‌ ఇచ్చానని గుర్తుచేసుకున్నారు. ఇలా ఎన్నో విషయాలను ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమంలో యడ్లపాటి వెంకట్రావు పంచుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని