Omicron: భారత్‌లో ఒమిక్రాన్‌.. అనూహ్యం కాదు!

 కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు భారత్‌లో బయటపడటం అనూహ్యమేమీ కాదని.. మనమంతా దేశాలు అనుసంధానమైన 

Published : 03 Dec 2021 09:53 IST

ప్రపంచమంతా జాగ్రత్తలు పాటించాలి
డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి పూనమ్‌ ఖేత్రపాల్‌

దిల్లీ/హరారే: కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు భారత్‌లో బయటపడటం అనూహ్యమేమీ కాదని.. మనమంతా దేశాలు అనుసంధానమైన ప్రపంచంలో జీవిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్‌ డాక్టర్‌ పూనమ్‌ ఖేత్రపాల్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని, వైరస్‌ కట్టడికి అవసరమైన అన్ని చర్యలూ చేపట్టాలని సూచించారు. కరోనా మిగతా వేరియంట్లకు తీసుకున్నట్టే ఒమిక్రాన్‌కు కూడా కొవిడ్‌ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డబ్ల్యూహెచ్‌ఓ ఆగ్నేయాసియా ప్రాంతంలో గుర్తించిన తొలి రెండు కేసులు ఇవేనని ఆమె తెలిపారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌లో ఉత్పరివర్తనాలు ఎక్కువగా ఉన్నాయని.. అందులో కొన్ని ఆందోళనకరంగా కనిపిస్తున్నాయని చెప్పారు.

దక్షిణాఫ్రికాలో 172 కేసులు..

ఒమిక్రాన్‌ తొలిసారి వెలుగు చూసిన దక్షిణాఫ్రికాలో ఈ రకం కేసులు మొత్తం 172 వరకు బయటపడినట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. బోట్స్‌వానాలో 19 కేసులు నమోదయ్యాయి. ఘనా, నైజీరియా, పశ్చిమ ఆఫ్రికా, ఇతర ఆఫ్రికన్‌ దేశాల్లోనూ కేసులు పెరుగుతున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. కాగా అమెరికా, నెదర్లాండ్స్, హాంకాంగ్, ఇజ్రాయెల్, బెల్జియం, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, డెన్మార్క్, ఆస్ట్రియా, కెనడా, స్వీడన్, స్విట్జర్లాండ్, స్పెయిన్, పోర్చుగల్, జపాన్, ఫ్రాన్స్, బ్రెజిల్‌ తదితర 29 దేశాల్లోనూ ఈ కేసులు బయట పడ్డాయి. 

నార్వేలో ‘కొత్త’ విజృంభణ.. 

ఒమిక్రాన్‌ నార్వేలో విజృంభిస్తోంది. దేశ రాజధాని ఓస్లో పరిసర ప్రాంతాల్లో 50 మందికి పైగా దీని బారిన పడ్డారు. నార్వేలో గత సోమవారం తొలి కేసు బయటపడగా బుధవారం నాటికి అనూహ్యంగా పెరిగాయి. సింగపూర్‌లో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్‌ సోకినట్లు అధికారులు తెలిపారు.
అమెరికాలో బూస్టర్‌ డోసులు

బైడెన్‌ ప్రభుత్వ యోచన 

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా నివారణకు శీతాకాల ప్రణాళికలో భాగంగా టీకాల బూస్టర్‌ డోసులు ఇప్పించే ఏర్పాట్లు చేయాలని అధ్యక్షుడు జో బైడెన్‌ భావిస్తున్నారు. దీనిపై అత్యవసరంగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మాస్కులు ధరించడం తదితరాలు తప్ప కొత్త ఆంక్షలు ఏవీ లేకుండానే ఒమిక్రాన్‌ వంటి నూతన ఉత్పరివర్తనాలను ఎదుర్కోవాలని ప్రతిపాదించారు. ఇంటి దగ్గర కరోనా పరీక్షలు చేయించుకుంటే ఖర్చులు చెల్లించాలని ప్రయివేటు ఆరోగ్య బీమా సంస్థలను ఆదేశించనున్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్నా, తీసుకోకపోయినా ఇతర దేశాల నుంచి వచ్చే వారు తప్పకుండా పరీక్షలు చేయించాలన్న నిబంధన కూడా విధించనున్నారు. దేశంలో మొత్తం పది కోట్ల మంది బూస్టర్‌ డోసులకు అర్హత సాధించారు. ఎంతగా నచ్చజెప్పినప్పటికీ మరో 40.3 లక్షల మంది అసలు టీకాలే వేసుకోలేదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బూస్టర్‌ డోసులపై అవగాహన కల్పించనున్నారు.

బడులకు 14% తగ్గనున్న ప్రత్యక్ష హాజరు! 

దిల్లీ: ఒమిక్రాన్‌ వ్యాప్తి భయాల కారణంగా భారత్‌లో పాఠశాలలకు విద్యార్థుల ప్రత్యక్ష హాజరు 14% మేర తగ్గే అవకాశముందని ‘లోకల్‌ సర్కిల్స్‌’ సంస్థ సర్వేలో వెల్లడైంది. ఆ సంస్థ దేశవ్యాప్తంగా 308 జిల్లాల్లో 15,875 మంది తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. తమ పిల్లల్ని ప్రత్యక్ష తరగతులకు పంపడం మానేస్తామని 14% మంది తల్లిదండ్రులు తెలిపారు. దేశంలో ఒక్క ఒమిక్రాన్‌ రకం కేసు వెలుగుచూసినా.. చిన్నారుల్ని బడులకు పంపబోమని మరో 5% మంది వెల్లడించారు. తమ జిల్లాలో ఆ రకం కరోనా వ్యాప్తి బయటపడినప్పుడే.. పిల్లల్ని పాఠశాలలకు పంపే విషయంపై నిర్ణయం తీసుకుంటామని మరో 10% మంది పేర్కొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని