హాజిల్‌వుడ్‌ మాయ.. ఆస్ట్రేలియా విజయం

ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా తొలి వన్డేలో అద్భుతంగా రాణించింది. హాజిల్‌వుడ్‌ 3/26 చెలరేగడంతో 295 పరుగల ఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌ 275/9తో సరిపెట్టుకుంది...

Published : 12 Sep 2020 14:10 IST

తొలి వన్డేలో ఇంగ్లాండ్‌పై 19 పరుగులతో గెలుపు

(Photo: Cricket Australia Twitter)

మాంచెస్టర్‌: ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా తొలి వన్డేలో అద్భుతంగా రాణించింది. హాజిల్‌వుడ్‌ 3/26 చెలరేగడంతో 295 పరుగల ఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌ 275/9తో సరిపెట్టుకుంది. మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ సామ్‌ బిల్లింగ్స్‌(118) శతకంతో మురిపించినా చివర్లో అతడికి సహకరించే బ్యాట్స్‌మన్‌ లేక ఆతిత్య జట్టు ఓటమిపాలైంది. దీంతో ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్‌లో తొలి విజయం నమోదు చేసింది. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కంగారూ జట్టు 123 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అప్పుడే మిచెల్‌ మార్ష్‌(73), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌(77) బాధ్యతాయుతంగా ఆడి జట్టు స్కోరును గాడిన పెట్టారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 126 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 294/9 భారీ స్కోర్‌ సాధించింది.

ఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌ ఆది నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. హాజిల్‌వుడ్‌(3), ఆడం జంపా(4) దెబ్బకు 57/4తో ఓటమి అంచున నిలిచింది. తర్వాత జానీ బెయిర్‌ స్టో(84), సామ్‌ బిల్లింగ్స్‌(118) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 113 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే ప్రమాదకరంగా మారుతున్న బెయిర్‌స్టోను.. హాజిల్‌వుడ్‌ ఒక అద్భుతమైన డైవ్‌ క్యాచ్‌తో పెవిలియన్‌ పంపాడు. అనంతరం టెయిలెండర్లతో కలిసి సామ్‌ మ్యాచ్‌ను గెలిపించే ప్రయత్నం చేసినా అప్పటికే ఆస్ట్రేలియా మ్యాచ్‌పై పట్టు సాధించింది. చివర్లో‌ అతడికి సహకరించే బ్యాట్స్‌మన్‌ లేకపోవడంతో ఇంగ్లాండ్‌ 50 ఓవర్ల పాటు పూర్తిగా బ్యాటింగ్‌ చేసి 275/9తో నిలిచింది. దీంతో కంగారూ జట్టు 19 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని