సిరీస్‌ చేజిక్కించుకున్న ఇంగ్లాండ్‌

నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో గెలుపొంది ఇంగ్లండ్‌ జట్టు సిరీస్‌ను చేజిక్కించుకుంది. వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను..

Published : 29 Jul 2020 00:57 IST

నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో ఘన విజయం

500 వికెట్ల క్లబ్‌లో చేరిన స్టువర్ట్‌ బ్రాడ్‌

 

మాంచెస్టర్‌: నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ అదరగొట్టింది. వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. మూడో మ్యాచ్‌లో 269 పరుగుల భారీ తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. లాక్‌డౌన్‌ అనంతరం నిర్వహించిన ఈ మొదటి టెస్టు సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌ను వెస్టిండీస్‌ సొంతం చేసుకోగా, రెండో దాంట్లో ఇంగ్లాండ్‌ గెలుపొందింది. 

మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌  369 పరుగులు చేయగా పర్యాటక జట్టు 197 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 226 పరుగులు సాధించిన ఆతిథ్య జట్టు డిక్లేర్‌ చేసింది. 399 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్‌ కనీసం పోరాడకుండా చేతులెత్తేశారు. దీంతో ఆ జట్టు 129 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. వర్షం కారణంగా సోమవారం ఆట నిలిచిపోయినా పర్యాటక జట్టు ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. క్రిస్‌ వోక్స్‌ ఐదు వికెట్లు సాధించగా, బ్రాడ్‌ నాలుగు వికెట్లు తీశాడు. 

ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ మరో ఘనత సాధించాడు. టెస్ట్‌ క్రికెట్‌లో 500 వికెట్లు కొల్లగొట్టాడు. మూడో టెస్టులో ఓపెనర్‌ బ్రాత్‌వైట్‌ వికెట్‌ తీసి 500 వికెట్లు పడగొట్టిన ఏడో బౌలర్‌గా నిలిచాడు. 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బ్రాత్‌వైట్‌ను ఎల్‌బీడబ్ల్యూ చేసి బ్రాడ్‌ ఈ ఘనత సాధించాడు. 2017లో జేమ్స్‌ అండర్సన్‌ తీసుకున్న 500వ వికెట్‌ కూడా బ్రాత్‌వైట్‌దే కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని