కోహ్లీ లేదా స్మిత్‌.. నేను మాత్రం వెళ్లను 

ఒక టెస్టు మ్యాచ్‌లో గెలవాలంటే కచ్చితంగా శతకం చేయాల్సిన పరిస్థితి వస్తే స్టీవ్‌స్మిత్‌ లేదా విరాట్‌కోహ్లీని పంపిస్తానని, అంతేకాని తాను మాత్రం వెళ్లనని శ్రీలంక మాజీ సారథి...

Updated : 10 Aug 2020 18:53 IST

జహీర్‌ఖాన్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం: సంగక్కర

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒక టెస్టు మ్యాచ్‌లో గెలవాలంటే కచ్చితంగా శతకం చేయాల్సిన పరిస్థితి వస్తే స్టీవ్‌స్మిత్‌ లేదా విరాట్‌కోహ్లీని పంపిస్తానని, అంతేకాని తాను మాత్రం వెళ్లనని శ్రీలంక మాజీ సారథి కుమార సంగక్కర చెప్పాడు. ప్రస్తుతం మెరిల్‌బోర్న్‌ క్రికెట్‌ క్లబ్‌కు అధ్యక్షుడిగా కొనసాగుతున్న అతడు త్వరలోనే ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు. దీంతో అతడి కోసం ఆ క్రికెట్‌ క్లబ్‌ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ట్విటర్‌లో క్రికెట్‌ ప్రేమికులతో ప్రశ్న-జవాబుల సెషన్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా సంగక్కర పాల్గొని అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు జవాబులు చెప్పాడు. ఈ నేపథ్యంలోనే ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు అలా సమాధానమిచ్చాడు. 

అభిమానుల ప్రశ్న-జవాబులు

ఒక టెస్టు మ్యాచ్‌ గెలవాలంటే శతకం బాదాలి. అందుకు ఒక ఆటగాడు కావాలి. కోహ్లీ, స్మిత్‌, సంగక్కర. ఈ ముగ్గురిలో ఎవర్ని ఎన్నుకుంటారు?

సంగక్కర: హహహ.. కోహ్లీ లేదా స్మిత్‌నే ఎంచుకుంటా. నేను మాత్రం వెళ్లను.

ఏ పేస్‌ బౌలర్‌ను ఎదుర్కోడానికి మీరు కష్టంగా భావిస్తారు?

సంగక్కర: వసీం అక్రమ్‌ అయితే పీడకలే. నేను ఎక్కువ సార్లు ఆడింది జహీర్‌ బౌలింగ్‌లో. అతడి బంతిని అడ్డుకోవడం అత్యంత కష్టతరం.

ఒలింపిక్స్‌లో క్రికెట్‌ చేరుతుందని మీరు అనుకుంటున్నారా? అయితే ఎప్పుడు?

సంగక్కర: ఆ విషయంలో కచ్చితమైన నిర్ణయం ఉంది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ ప్రవేశపెట్టాలని భావిస్తున్నాం. ఎంసీసీతో పాటు చాలా క్రికెట్‌ బోర్డులు దాన్ని నిజం చేయాలని చూస్తున్నాయి. 

ఎంసీసీ ప్రెసిడెంట్‌గా పనిచేశాక ఎంత సంతృప్తి పొందారు?

సంగక్కర: ఈ పదవి ఆస్వాదించదగినది. ఈ చారిత్రక క్లబ్‌లో అత్యుత్తమ స్థాయిలో పనిచేయడం గొప్పగా భావిస్తున్నా. అయితే, ఆటను కొత్తగా తీర్చిదిద్దడం, ముందుకు తీసుకెళ్లడంలో ఎంసీసీ ఎప్పుడూ భాగస్వామ్యం అయింది. అందులో పాలుపంచుకోవడమే నిజమైన సంతృప్తి. 

మహిళల క్రికెట్‌ కోసం ఎంసీసీ భవిష్యత్‌ ప్రణాళికలు ఏమిటి?

సంగక్కర: మహిళల క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఎంసీసీ ఎప్పుడూ ముందుంటుంది. భవిష్యత్‌లోనూ ఇలాగే కొనసాగుతుంది. ఐసీసీ మద్దతుతో లార్డ్స్‌ మైదానంలో ఎంసీసీ వుమెన్స్‌ డే నిర్వహిస్తాం. 

మీరు టెస్టు కీపర్‌గా ఉన్న రోజుల్లో ఏ బౌలర్‌కు కీపింగ్‌ చేయడం కష్టంగా అనిపించింది?

సంగక్కర: ముత్తయ్య మురళీధరన్‌ బౌలింగ్‌లో కీపింగ్‌ చేయడం చాలా కష్టం. అతడి వేరియేషన్‌తో చాలా కష్టంగా ఉండేది. 

నాయకత్వ లక్షణాలను ఎలా పెంపొందించుకున్నారు?

సంగక్కర:మన సహజత్వాన్ని కాపాడుకుంటూ అన్ని విషయాలు నేర్చుకోవడం ద్వారా. ఓపెన్‌ మైండ్‌తో ఇతరుల నుంచి నేర్చుకోవడం. అలాగే నాకంటూ నిర్దిష్టమైన ప్రణాళికలు నిర్దేశించుకోవడం ద్వారా.

హాయ్‌ సంగా.. మీరు క్రికెటర్‌గా మారడానికి ఏమిటి కారణం. అలాగే మీ రోల్‌ మోడల్‌ ఎవరు?

సంగక్కర: సర్‌ వివియన్‌ రిచర్డ్స్‌, బ్రయన్‌ లారా నా బ్యాటింగ్‌ హీరోలు. ఇక నేను అంతర్జాతీయ క్రికెటర్‌గా మారడానికి 1996లో శ్రీలంక జట్టు విశ్వవిజేతగా నిలవడమే.

 మీకు కీపింగ్‌ చేయడం ఇష్టమా లేక ఫీల్డింగ్‌ చేయడం ఇష్టమా?

సంగక్కర:ఇది కష్టమైన ప్రశ్న. అయితే, నేనెప్పుడూ మంచి ఫీల్డర్‌ను కాదు. కాబట్టి.. కీపింగ్‌నే ఎంచుకుంటా. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని