బతికే ఉన్నానని అప్పుడు అనిపించింది: రసెల్‌ 

వెస్టిండీస్ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ రసెల్ అంటే అందరికీ గుర్తొచ్చేది బౌలర్లపై విరుచుకుపడుతూ బౌండరీలు, సిక్సర్ల మోత మోగించడం. కానీ యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌ పదమూడో సీజన్‌లో అతడు ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడలేదు.

Published : 13 Dec 2020 01:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వెస్టిండీస్ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ రసెల్ అంటే అందరికీ గుర్తొచ్చేది బౌలర్లపై విరుచుకుపడుతూ బౌండరీలు, సిక్సర్ల మోత మోగించడం. కానీ యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌ పదమూడో సీజన్‌లో అతడు ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడలేదు. 10 మ్యాచ్‌లు ఆడిన అతడు 13 సగటుతో 117 పరుగులే చేశాడు. అయితే ఐపీఎల్‌లో సత్తాచాటడానికి ఎంతో ప్రయత్నించానని, కానీ ఏదీ కలిసిరాలేదని రసెల్ అన్నాడు. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్ (సీపీఎల్‌)‌ అనంతరం వెంటనే యూఏఈకి చేరుకోవడంతో బయోబబుల్‌ తనని మానసికంగా దెబ్బతీసిందని తెలిపాడు.

‘‘ఐపీఎల్‌లో పరుగులు సాధించాలనుకున్నా. దాని కోసం టెక్నిక్‌, స్టాన్స్‌లో మార్పులతో పాటు సమయాన్ని బట్టి భారీ షాట్లు ఆడటానికి ప్రయత్నించా. కానీ ఏదీ కలిసిరాలేదు. నాపై ఒత్తిడి ఉందనేది నిజం. నేను ప్రతిభావంతుడినే. కానీ ఈ ఏడాది ఐపీఎల్‌లో ఇలా ఎందుకు జరిగిందో తెలియట్లేదు. అన్నీ చకచకా జరిగిపోవాలని కోరుకున్నాను. సీపీఎల్‌ నుంచి నేరుగా అబుదాబికి వచ్చాను. రోజులు గడుస్తూ ఉన్నాయి. ప్రాక్టీస్‌ చేయడం, ఆ తర్వాత హోటల్లోని రూమ్‌కి వెళ్లడం, పడుకోవడం, లేచి తయారై ప్రాక్టీస్‌ చేయడం... ఆ ప్రదేశాల్లో తప్ప బయటికి వెళ్లే అవకాశం లేదు. అయితే బయోబబుల్‌ నుంచి బయటికి వచ్చిన తర్వాత దుబాయ్‌లో సమయాన్ని ఆస్వాదించాను. ఇంకా బతికే ఉన్నానని అప్పుడు అనిపించింది. ఇలాంటి భావన జైలులో నుంచి బయటికి వచ్చినప్పుడు కలుగుతుంటుంది. కానీ లాక్‌డౌన్‌ వల్ల ఆ అనుభూతి కలిగింది’’ అని రసెల్ తెలిపాడు.

పదమూడో సీజన్‌లో కోల్‌కతా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. అయిదో స్థానంతో సరిపెట్టుకుంది. టాప్‌-4కు దూసుకెళ్లిన హైదరాబాద్, బెంగళూరు జట్ల మాదిరిగానే మోర్గాన్‌సేన 14 పాయింట్లు సాధించినప్పటికీ నెట్‌రన్‌రేటులో వెనుకబడటంతో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. జట్టు ప్రయోజనాల కోసం సీజన్‌ మధ్యలో దినేశ్‌ కార్తీక్ కెప్టెన్సీ బాధ్యతలను మోర్గాన్‌కు ఇచ్చిన విషయం తెలిసిందే.  

ఇదీ చదవండి
నీ ప్రయాణం అజరామరం..
కోహ్లీ లేకపోతే భారత్‌కు అంత నష్టమా?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు