Published : 17 Aug 2020 15:33 IST

మహీ.. ఎప్పటికీ నువ్వే నా కెప్టెన్‌: కోహ్లీ

మాటలు రానీ సందర్భాల్లో ఇదీ ఒకటి  

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి, దిగ్గజ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌పై క్రికెట్‌ ప్రముఖులు ఇంకా స్పందిస్తున్నారు. భారత క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన ధోనీకి బీసీసీఐ ఘన వీడ్కోలు అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే అతడి గురించి ఎవరేమన్నారో వీడియోలు రూపొందించి ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంటోంది. దానిలో భాగంగా తొలుత విరాట్‌ కోహ్లీ భావోద్వేగంతో స్పందించిన వీడియోను పోస్టు చేసింది. కోహ్లీ మాట్లాడుతూ.. జీవితంలో పలు సందర్భాల్లో మాటలు రావని, అలాంటి క్షణాల్లో ఇది కూడా ఒకటని పేర్కొన్నాడు. టీమ్‌ఇండియా ప్రయాణించే బస్సులో మహీ ఎప్పుడూ వెనుక సీటులో కూర్చునేవాడని, అలాగే జట్టు వెనుక అండగా ఉండి నడిపించాడని ప్రశంసించాడు. అతడితో మంచి అనుబంధం ఉందని, ఇద్దరం ఎంతో స్నేహంగా ఉండేవాళ్లమని గుర్తుచేసుకున్నాడు. మాజీ సారథి తనని బాగా అర్థం చేసుకుంటాడని, అతనెప్పుడూ జట్టు విజయాల కోసమే పరితపించేవాడని తెలిపాడు. ఈ రిటైర్మెంట్‌ తర్వాత ధోనీ భవిష్యత్తు‌ బాగుండాలని, ప్రశాంతంగా జీవించాలని కోహ్లీ ఆకాంక్షించాడు. చివరి మాటగా ఎప్పటికీ తనకు ధోనీయే కెప్టెన్‌ అని వ్యాఖ్యానించాడు.

ఎవరెవరు ఏమన్నారు?
* స్వాత్రంత్ర్య దినోత్సవాన సూర్యుడు అస్తమించే సమయంలో అద్భుత కెరీర్‌కు ముగింపు. అతిగొప్ప ఆటగాళ్లలో అతనొకడు. అతడి చిత్తుశుద్ధి, ప్రశాంతంగా ఉండే స్వభావం, ఒత్తిడిని తట్టుకునే శక్తి, విమర్శలను ఎదుర్కొనే ధైర్యం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఒక కెప్టెన్‌గా అతనెప్పుడూ మౌంట్‌ ఎవరెస్ట్‌ మీదే ఉంటాడు. అతడు సాధించని ఘనత ఏదీ లేదు. ఈ సందర్భంగా ధోనీ, సాక్షి, జీవాకు అభినందనలు. మహీ ఇకపై మరింత బాగా జీవితాన్ని ఆస్వాదించాలని ఆశిస్తున్నా. చివరగా.. లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఎంఎస్‌ ధోనీకి సెల్యూట్‌. -హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి

*2011 వన్డే ప్రపంచకప్‌లో అతను బ్యాట్‌పట్టుకొని మైదానంలోకి వెళ్లడం నాకింకా గుర్తుంది. అప్పుడతని ముఖంలో ఎంతో ఆత్మవిశ్వాసం కనిపించింది. అది నాలోనూ ప్రేరణ కలిగించింది. అలాగే తన ఆటతో చుట్టుపక్కలవారికి కూడా స్ఫూర్తిగా నిలిచాడు. ఒక ఆటగాడిగా, కెప్టెన్‌గా, అంతకుమించిన గొప్ప వ్యక్తిగా ఎదిగిన ధోనీ సర్‌కు ధన్యవాదాలు. -స్మృతి మంధాన

ధోనీ ఒక స్ఫూర్తి‌. చిన్న పట్టాణాల్లోని ప్రతీ పిల్లాడికి అతనో కల. దేశం కోసం ఆడాలనుకునే ప్రతీఒక్కరికీ స్ఫూర్తి ప్రదాత. అతనిలో నాకు నచ్చేది ప్రశాంతంగా ఉండటమే. క్లిష్టపరిస్థితుల్లోనూ ఒత్తిడికి గురికాడు. అలాగే అతని బ్యాటింగ్‌, స్టైల్‌ నాకెంతో నచ్చుతాయి. ఒక బ్యాట్స్‌మన్‌గా, వికెట్‌కీపర్‌గా అత్యుత్తమ ప్రదర్శన చేస్తాడు. అతడిలా మరెవరూ ఉండరు. అతనెప్పటికీ లెజెండ్‌గానే ఉంటాడు.  -మిథాలి రాజ్‌

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts