PAK vs AFG: అఫ్గానిస్థాన్‌ మరో సంచలన విజయం.. పాక్‌ సెమీస్ ఆశలు సంక్లిష్టం!

ప్రపంచకప్‌లో అఫ్గాన్‌ మరో సంచలన విజయం సాధించింది. ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన ఆ జట్టు.. ఇప్పుడు పాక్‌పై పంజా విసిరింది.  పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Updated : 24 Oct 2023 11:52 IST

చెన్నై: ప్రపంచకప్‌లో అఫ్గాన్‌ మరో సంచలన విజయం సాధించింది. ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన ఆ జట్టు.. ఇప్పుడు పాక్‌పై పంజా విసిరింది. పాకిస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని అఫ్గానిస్థాన్‌ రెండే వికెట్లు కోల్పోయి ఒక ఓవర్‌ మిగిలుండగానే ఛేదించింది. పాకిస్థాన్‌కిది హ్యాట్రిక్ ఓటమి. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడు ఓటములతో ఉన్న పాక్‌ సెమీస్ ఆశల్ని సంక్లిష్టం చేసుకుంది. ఇకపై ఆ జట్టు మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గితేనే టాప్‌-4లోకి వచ్చే అవకాశం ఉంది.

లక్ష్యఛేదనకు దిగిన అఫ్గాన్‌కు ఓపెనర్లు రహ్మనుల్లా గుర్భాజ్ (65; 53 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌), ఇబ్రహీం జాద్రాన్‌ (87;  113 బంతుల్లో 10 ఫోర్లు) అర్ధ శతకాలతో రాణించి జట్టు విజయానికి బలమైన పునాది వేశారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం వచ్చిన రహ్మత్‌ షా (77*; 84 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), హష్మాతుల్లా షాహిది (48*; 45 బంతుల్లో 4 ఫోర్లు) నిలకడగా ఆడి అఫ్గాన్‌కు విజయాన్ని అందించారు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, హసన్ అలీ తలో వికెట్ పడగొట్టారు.

పాక్‌ బ్యాటర్లలో కెప్టెన్ బాబర్ అజామ్ (74; 92 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), ఓపెనర్ అబ్దుల్లా షఫీక్‌ (58; 75 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. సాద్ షకీల్ (25), ఇమామ్ ఉల్ హక్ (17), మహ్మద్ రిజ్వాన్ (8) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరగా.. చివర్లో షాదాబ్‌ ఖాన్‌ (40; 38 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌ నిలకడగా ఆడగా.. ఇఫ్తికార్ అహ్మద్‌ (40; 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. అఫ్గాన్ బౌలర్లలో నూర్ అహ్మద్‌ 3, నవీనుల్ హక్ 2, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, మహ్మద్‌ నబీకి ఒక్కో వికెట్ దక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని