AUS vs NZ: ఉత్కంఠ పోరులో ఆసీస్‌దే విజయం.. రచిన్‌, నీషమ్ పోరాటం వృథా

 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆస్ట్రేలియా ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్ 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. ఈ లక్ష్యఛేదనలో కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 383 పరుగులు చేసింది.

Updated : 28 Oct 2023 18:54 IST

ధర్మశాల: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆస్ట్రేలియా ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్ 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. ఈ లక్ష్యఛేదనలో కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 383 పరుగులు చేసింది. రచిన్‌ రవీంద్ర (108; 82 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీ వృథా అయింది. డారిల్‌ మిచెల్ (54; 51 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకం బాదాడు. చివర్లో జేమ్స్ నీషమ్ (58; 39 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. డేవాన్‌ కాన్వే (28), విల్ యంగ్ (32), టామ్ లేథమ్‌ (21), గ్లెన్ ఫిలిప్స్‌ (12), మిచెల్ శాంట్నర్‌ (17) భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్‌ జంపా 3, హేజిల్‌వుడ్ 2, కమిన్స్‌ 2, మ్యాక్స్‌వెల్ ఒక వికెట్ తీశారు. ఆసీస్‌కు ఇది వరుసగా నాలుగో విజయం కాగా.. న్యూజిలాండ్‌కు రెండో ఓటమి.  

ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (109: 67 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. కేవలం 59 బంతుల్లోనే శతకం బాది ప్రపంచకప్‌లో వేగవంతమైన సెంచరీ చేసిన ఓపెనర్‌గా రికార్డు సృష్టించాడు. డేవిడ్ వార్నర్ (81: 65 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 175 పరుగులు జోడించారు. అయితే, కివీస్‌ బౌలర్లు పుంజుకుని వికెట్లు తీయడంతో ఆసీస్‌ ఇన్నింగ్స్ కాస్త నెమ్మదించింది. కానీ, చివర్లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ (41: 24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (37: 14 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. ఇంగ్లిస్‌ (38), మిచెల్ మార్ష్ (36) ఫర్వాలేదనిపించారు. స్టీవ్‌ స్మిత్ (18), మార్నస్‌ లబుషేన్ (18) విఫలమయ్యారు. కివీస్‌ బౌలర్లలో బౌల్ట్‌ 3, గ్లెన్‌ ఫిలిప్స్‌ 3, మిచెల్ శాంట్నర్ 2.. మ్యాట్ హెన్రీ, జేమ్స్ నీషమ్‌ చెరో వికెట్‌ తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని