Cricket News: మాకే అవకాశాలు ఎక్కువన్న బాబర్.. నెంబర్‌వన్‌ జట్టుగా ఆసీస్‌

Updated : 10 Sep 2023 11:00 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసియాకప్‌ 2023 సూపర్-4లో భాగంగా భారత్- పాకిస్థాన్‌ జట్ల మధ్య పోరు జరగనుంది. అయితే, ఈ మ్యాచ్‌లో తమకే అధిక అవకాశాలు ఉంటాయని ఆ జట్టు కెప్టెన్ బాబర్‌ అజామ్‌ వ్యాఖ్యానించాడు. అలాగే పాక్‌ జట్టుతో జాగ్రత్తగా ఉండాలని మాజీ పేసర్ షోయబ్‌ అక్తర్ సూచించాడు. ఇక వన్డేల్లో నెంబర్‌వన్‌ జట్టుగా ఆస్ట్రేలియా అవతరించింది. ఇలా క్రికెట్‌ విశేషాలు మీ కోసం.. 

శ్రీలంకలో ఆడటం కలిసొస్తుంది: పాక్‌ కెప్టెన్

టీమ్‌ఇండియాతో మరోసారి తలపడే అవకాశం రావడం అద్భుతమని పాకిస్థాన్‌ జట్టు కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ తెలిపాడు. అయితే, శ్రీలంకలో ఇంతకుముందు వన్డే సిరీస్‌ ఆడటం తమకు కలిసి వస్తుందని అభిప్రాయపడ్డాడు. అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్‌, లంక ప్రీమియర్‌ లీగ్‌లో ఇక్కడే ఆడినట్లు గుర్తు చేశాడు. ‘‘పాకిస్థాన్‌, శ్రీలంక జట్లు ఇక్కడ చాలా క్రికెట్ ఆడాయి. అందుకే, భారత్‌తో మ్యాచ్‌లో మాకే కాస్త ఎడ్జ్‌ ఉంటుందని భావిస్తున్నా. అయితే, టీమ్‌ఇండియాను తక్కువగా అంచనా వేయడం లేదు. బౌలింగ్‌లో శుభారంభం చేస్తే మిడిల్‌ ఓవర్లలో వికెట్లు తీయడం మరింత సులభమవుతుంది. మా బౌలింగ్‌ కాంబినేషన్‌ అద్భుతంగా ఉంది. చివర్లోనూ పేసర్లు కట్టడి చేయగలరు. ఒకరు విఫలమైనా మరొకరు ఆ బాధ్యతలను తీసుకుంటారు. భారత్‌తో మ్యాచ్‌ సందర్భంగా అధికంగా వర్షం ఉండదని భావిస్తున్నా. వాతావరణ పరిస్థితులు మన నియంత్రణలో ఉండవు. మా చేతుల్లో ఉండే అంశాలపైనే దృష్టి సారిస్తాం’’ అని బాబర్‌ తెలిపాడు.


ఆత్రుతగా ఎదురు చూస్తున్నా: షోయబ్‌ అక్తర్

భారత్ - పాకిస్థాన్‌ మ్యాచ్‌ వీక్షించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు మాజీ పేసర్ షోయబ్‌ అక్తర్ వ్యాఖ్యానించాడు. సూపర్‌-4లో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కొలంబో వేదికగా మ్యాచ్‌ జరగనుంది. ఈ క్రమంలో ట్విటర్ వేదికగా అక్తర్ స్పందిస్తూ.. ‘‘ఇప్పుడే కొలంబోలో అడుగు పెట్టా. భారత్-పాక్ మ్యాచ్‌ చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. అయితే, పాకిస్థాన్‌ జట్టుతో జాగ్రత్త’’ అంటూ ట్వీట్ చేశాడు. 


టాప్‌ ర్యాంక్‌కు చేరిన ఆసీస్

ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు వన్డేల్లో మరోసారి అగ్రస్థానానికి చేరుకుంది. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో వరుసగా రెండు వన్డేల్లో గెలిచిన ఆసీస్‌ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చింది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 121 పాయింట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు తొలి ర్యాంక్‌లో ఉన్న పాకిస్థాన్‌ను (120 పాయింట్లు) ఆసీస్‌ వెనక్కి నెట్టింది. అయితే, దక్షిణాఫ్రికాతో ఐదు వన్డేల సిరీస్‌ను ఆసీస్‌ ఆడుతోంది. మరోవైపు పాక్‌ ఆసియా కప్‌ ఆడుతోన్న విషయం తెలిసిందే. దీంతో ర్యాంకులు మళ్లీ తారుమారయ్యే అవకాశాలు లేకపోలేదు. టీమ్‌ఇండియా 114 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో సెంచరీ సాధించిన ఆసీస్‌ ఆటగాడు డేవిడ్ వార్నర్‌ భారత క్రికెట్ దిగ్గజం సచిన్‌ రికార్డుల్లో ఒకదానిని అధిగమించాడు. ఓపెనర్‌గా వార్నర్ 46 సెంచరీలను నమోదు చేశాడు. వన్డేల్లో 20, టెస్టుల్లో 25, టీ20ల్లో ఒకటి ఉన్నాయి. ఓపెనర్‌గా సచిన్‌ 45 శతకాలు బాదాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు