MS Dhoni: కెప్టెన్‌గా చెన్నైకి 4 టైటిళ్లు అందించిన మహేంద్రుడు

చెన్నై జట్టుకు అపూర్వ విజయాలు అందించిన ఎంఎస్‌ ధోనీ మెగా టోర్నీ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. సుదీర్ఘకాలంపాటు చెన్నైకి నాయకత్వం వహించిన మహేంద్ర సింగ్ ధోనీ అనూహ్యంగా కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు.

Updated : 25 Mar 2022 21:21 IST

ఇంటర్నెట్ డెస్క్‌: చెన్నై జట్టుకు అపూర్వ విజయాలు అందించిన ఎంఎస్‌ ధోనీ మెగా టోర్నీ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. సుదీర్ఘకాలంపాటు చెన్నైకి నాయకత్వం వహించిన మహేంద్ర సింగ్ ధోనీ అనూహ్యంగా కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. దీంతో చెన్నై యాజమాన్యం తదుపరి సారథిగా రవీంద్ర జడేజాను నియమించింది. అయితే ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని చెన్నై ఎన్నో మధురమైన విజయాలతో నాలుగు సార్లు ఛాంపియన్‌గా అవతరించింది. ఆది నుంచి చెన్నై జట్టును ముందుండి నడిపించిన ధోనీ.. ఆ జట్టును విజేతగా నిలబెట్టిన మ్యాచ్‌లను ఓసారి గుర్తుకు తెచ్చుకుందాం..

  • ఈ టోర్నీ ప్రారంభమైన తొలి సీజన్‌లోనే చెన్నై ఫైనల్‌కు చేరుకుంది. రెండో సీజన్‌లో సెమీస్‌కే పరిమితమైంది. ఇక మూడో సీజన్‌లో (2010) చెన్నై టైటిల్‌ను నెగ్గింది. ముంబయితో జరిగిన ఫైనల్‌లో 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అనంతరం ముంబయిని 146 పరుగులకే పరిమితం చేసి తొలిసారి టైటిల్‌ వశం చేసుకుంది. 
  • ధోనీ నాయకత్వంలోని చెన్నై వరుసగా రెండో ఏడాది (2011) కూడా టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్‌ మ్యాచులో తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై ఐదు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఓపెనర్లు మైకెల్ హస్సీ (63), మురళీ విజయ్‌ (95) గొప్పగా ఆడారు. అనంతరం బెంగళూరును 147/8 పరుగులకే పరిమితం చేసింది.  
  • చివరిసారిగా 2011 తర్వాత చెన్నై మళ్లీ  2018లో టైటిల్‌ నెగ్గడం విశేషం. అయితే ఇందులో రెండేళ్లపాటు నిషేధానికి గురికావడం.. మరో మూడేళ్లు ఫైనల్‌కు చేరినా కప్‌ కొట్టలేకపోవడం జరిగింది. డేవిడ్ వార్నర్‌ నేతృత్వంలోని హైదారాబాద్‌ మంచి ఊపులో ఉంది. అంతకు రెండేళ్ల ముందే (2016) కప్‌ను నెగ్గింది. అయితే ఏడేళ్లపాటు టైటిల్‌ దక్కించుకోలేదనే కసితో ఉన్న చెన్నైని ఆపడం హైదారాబాద్‌ వల్ల కాలేదు. తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్ 178/6 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 181 పరుగులు చేసి విజయం సాధించి మూడో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఓపెనర్‌ షేన్‌ వాట్సన్ (117) శతకంతో చెలరేగాడు. 
  • ఎంఎస్ ధోనీ నాయకత్వంలో చెన్నై సాధించిన చివరి కప్ (2021) ఇదే. అయితే అంతకు ముందు ఏడాది లీగ్‌ దశకే పరిమితమై విమర్శలపాలైన చెన్నై అద్భుతంగా పుంజుకుని మరీ ఛాంపియన్‌గా నిలిచింది. రెండు దశల్లో జరిగిన 14వ సీజన్‌ తొలి ఫేజ్‌లో చెన్నై రాణించలేదు కానీ... యూఏఈ వేదికగా జరిగిన రెండో ఎడిషన్‌లో మాత్రం చెలరేగి ఫైనల్‌కు దూసుకొచ్చి ఏకంగా కప్‌ను సొంతం చేసుకుంది. తుదిపోరులో కోల్‌కతాపై చెన్నై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై రుతురాజ్‌ గైక్వాడ్ (32), డుప్లెసిస్‌ ( 86), రాబిన్ ఉతప్ప (31), మొయిన్‌ అలీ (37*) చెలరేగడంతో మూడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అనంతరం శుభ్‌మన్‌ గిల్ (51), వెంకటేశ్‌ అయ్యర్ (50) రాణించినా.. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో 165/9 స్కోరుకే కేకేఆర్‌ పరిమితమైంది. దీంతో 27 పరుగుల ఆధిక్యంతో గెలిచి నాలుగో సారి చెన్నై టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని