IND vs SL : సాహా బాధ పడటంలో తప్పు లేదు.. అయితే పంత్‌ అర్హుడే: కార్తిక్

మొహాలీ వేదికగా  మార్చి 4 నుంచి శ్రీలంకతో...

Updated : 02 Mar 2022 10:37 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మొహాలీ వేదికగా  మార్చి 4 (శుక్రవారం) నుంచి శ్రీలంకతో తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్లు ఆటగాళ్లను ప్రకటించాయి. ప్రాక్టీస్‌ను షురూ చేశాయి. ఇక టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీకి కెరీర్‌లో ఈ మ్యాచ్‌ మైలురాయిగా నిలిచిపోనుంది. ఇది అతడికి వందో టెస్టు మ్యాచ్‌. మరోవైపు సీనియర్‌ వికెట్ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహాను జట్టులోకి తీసుకోకపోవడంపై చర్చ సాగుతోంది. అయితే వెటరన్‌ ప్లేయర్‌ దినేశ్ కార్తిక్‌.. సాహాకు మద్దతుగా నిలిచినా.. భారత జట్టులో పంత్‌ ఉండటమే సరైన నిర్ణయమని పేర్కొన్నాడు. ‘‘జట్టు యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మింగుడుపడటం కష్టమే. కానీ రిషభ్‌ను తీసుకోవడానికి గల కారణాలను అర్థం చేసుకోవాలి’’ అని కార్తిక్‌ తెలిపాడు.

జట్టులోకి తీసుకోనందుకు సాహా బాధపడటంలో తప్పేమీ లేదని కార్తిక్ అభిప్రాయపడ్డాడు. వికెట్ కీపింగ్‌లో నైపుణ్యం పరంగా సాహా అద్భుతమని కొనియాడాడు. ‘‘టీమ్‌లో స్థానం దక్కకపోతే ఎలాంటి క్రికెటర్‌ అయినా బాధపడతాడు. అయితే జట్టును ఏ విధంగా ఎంపిక చేశారో సెలెక్షన్‌ కమిటీ నిర్ణయాన్ని అంచనా వేసుకోవాలి. ప్రతి ఒక్కరూ దేశం కోసం ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటారు. అయితే ఎవరైనా వచ్చి ‘నీ సమయం అయిపోయింది’ అని చెప్తే దానిని జీర్ణించుకోవడం కష్టంతో కూడుకున్నదే’’ అని కార్తిక్‌ వివరించాడు. 

భారత క్రికెట్‌కు వృద్ధిమాన్‌ సాహా అపూర్వమైన సేవలను అందించాడని తెలిపాడు. ఇప్పటికీ అత్యుత్తమ వికెట్ కీపర్లలో సాహా ఒకడని పేర్కొన్నాడు. దాదాపు దశాబ్దన్నరం ఎంఎస్‌ ధోనీ జట్టులో ఎలా కొనసాగాడో.. అలానే గత రెండున్నర సంవత్సరాలుగా రిషభ్‌ పంత్‌ అంతే నిలకడగా రాణిస్తున్నాడని కార్తిక్ తెలిపాడు. అందుకే సాహా రెండో కీపర్‌గా ఉండాల్సి వస్తోందని చెప్పాడు. శ్రీలంకతో టెస్టులకు రిషభ్‌ పంత్‌కు తోడుగా యువ వికెట్ కీపర్‌ కేఎస్ భరత్‌ను సెలెక్షన్‌ కమిటీ ఎంచుకుందని కార్తిక్‌ వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని