ENG vs SL: విజృంభించిన శ్రీలంక పేసర్లు.. ఇంగ్లాండ్‌కు మరో షాక్‌ తప్పదా?

డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌కు మరో షాక్‌ తప్పేలాలేదు. ఇప్పటికే పసికూన అఫ్గాన్‌ చేతిలో ఓడిన ఇంగ్లిష్‌ జట్టు.. తనకన్నా బలహీన శ్రీలంకపై  చిత్తుగా ఓడే అవకాశముంది. శ్రీలంకతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 156 పరుగులకే కుప్పకూలింది.

Updated : 26 Oct 2023 17:21 IST

బెంగళూరు: డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ (England)కు మరో షాక్‌ తప్పేలాలేదు. ఇప్పటికే పసికూన అఫ్గాన్‌ చేతిలో ఓడిన ఇంగ్లిష్‌ జట్టు.. తనకన్నా బలహీన శ్రీలంకపై చిత్తుగా ఓడే అవకాశముంది. శ్రీలంకతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 33.2 ఓవర్లలో 156 పరుగులకే కుప్పకూలింది. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన చిన్నస్వామి స్టేడియంలో శ్రీలంక పేసర్ల ధాటికి ఇంగ్లాండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఒక్కరూ కూడా అర్ధ శతకం చేయలేకపోయారు. బెన్‌స్టోక్స్‌ (43; 73 బంతుల్లో 6 ఫోర్లు) టాప్ స్కోరర్‌. జానీ బెయిర్‌స్టో (30; 31 బంతుల్లో 3 ఫోర్లు), డేవిడ్ మలన్ (28; 25 బంతుల్లో 6 ఫోర్లు) కాసేపు నిలకడగానే ఆడినా ఎక్కువ సమయం క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. జోరూట్ (3,) జోస్ బట్లర్ (8), లియామ్ లివింగ్‌స్టోన్ (1) ఘోరంగా విఫలమయ్యారు. తర్వాత వచ్చిన మొయిన్ అలీ (15; 15 బంతుల్లో) కూడా ఆకట్టుకోలేకపోయాడు. క్రిస్‌ వోక్స్‌ (0), ఆదిల్ రషీద్‌ (2), మార్క్‌ వుడ్ (5), డేవిడ్ విల్లీ (14*) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో లాహిరు కుమార 3, ఏంజెలో మాథ్యూస్‌ 2, కాసున్ రజిత 2, మహీశ్‌ తీక్షణ ఒక వికెట్ పడగొట్టారు.

మొదటి ఆరు ఓవర్లకు ఇంగ్లాండ్ 44/0 స్కోరుతో పటిష్టమైన స్థితిలోనే ఉంది. ఈ మ్యాచ్‌తో పునరాగమనం చేసిన లంక బౌలర్‌ ఏంజెలో మాథ్యూస్‌ తన తొలి ఓవర్‌లోనే మలన్‌ను ఔట్‌ చేయడంతో ఇంగ్లాండ్ పతనం మొదలైంది. మలన్‌.. వికెట్‌కీపర్‌ కుశాల్ మెండిస్‌కు క్యాచ్‌ ఇవ్వగా.. తర్వాత వచ్చిన జో రూట్‌ రనౌటయ్యాడు. నిలకడగా ఆడిన ఓపెనర్‌ బెయిర్‌స్టో కూడా కొద్దిసేపటికే వెనుదిరిగాడు. అతడు రజిత బౌలింగ్‌లో మిడాన్‌లో ధనంజయకు చిక్కాడు. లాహిరు కమార తన వరుస ఓవర్లలో బట్లర్‌, లివింగ్‌ స్టోన్‌లను పెవిలియన్‌కు పంపాడు. బట్లర్.. కుశాల్‌ మెండిస్‌కు క్యాచ్‌ ఇవ్వగా.. లివింగ్‌స్టోన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. మొయిన్ అలీని 25 ఓవర్‌లో మాథ్యూస్‌ వెనక్కి పంపాడు. రజిత బౌలింగ్‌లో క్రిస్‌ వోక్స్‌.. సమరవిక్రమకు చిక్కాడు. ఒంటరి పోరాటం చేస్తున్న స్టోక్స్‌ను లాహిరు కుమార వెనక్కి పంపాడు. తర్వాత వచ్చిన ఆదిల్ రషీద్‌ 32 ఓవర్‌లో రనౌట్‌ కాగా.. తీక్షణ బౌలింగ్‌లో మార్క్‌వుడ్ స్టంపౌట్‌ కావడంతో ఇంగ్లాండ్ ఆలౌటైంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని