WI vs IND: ఉమ్రాన్‌ను సరిగ్గా వాడుకోవడమూ తెలియదా..?: ఆకాశ్‌ చోప్రా

విండీస్‌తో వన్డే సిరీస్‌ను (WI vs IND) భారత్‌ ప్రయోగాలకు వేదికగా మార్చుకుంది. తొలి వన్డేల్లో ప్రత్యర్థిని తక్కువ పరుగులకే ఆలౌట్‌ చేసిన భారత్‌.. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో భారీగా మార్పులు చేసింది.

Published : 29 Jul 2023 11:43 IST

ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్‌తో (WI vs IND) జరిగిన తొలి వన్డేలో ఒక్క ఉమ్రాన్‌ మాలిక్‌ (Umran Malik) మినహా.. మిగతా భారత బౌలర్లందరూ వికెట్‌ తీశారు. ఉమ్రాన్‌ తొలి ఓవర్‌లోనే పది పరుగులు ఇచ్చాడు. అయితే, తర్వాత వేసిన రెండు ఓవర్లలో కేవలం ఏడు పరుగులే ఇచ్చాడు. ఈ క్రమంలో ఉమ్రాన్‌ను సరిగ్గా వాడుకోవడంలో మేనేజ్‌మెంట్‌ విఫలమైందని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా విమర్శలు గుప్పించాడు. 

స్మిత్‌ ‘రనౌట్‌’ విషయంలో.. అంపైర్‌ చెప్పిందదే: స్టువర్ట్‌ బ్రాడ్

‘‘ఉమ్రాన్‌ను జట్టులోకి తీసుకోవడం బాగుంది. అయితే, కేవలం మూడు ఓవర్లు మాత్రమే వేయించారు. అతడు వికెట్‌ కూడా తీయలేదు. మిగతా బౌలర్లు రాణించడంతో విండీస్‌ త్వరగా వికెట్లను కోల్పోయింది. ఇలాంటప్పుడే ఉమ్రాన్‌ బౌలింగ్‌ను సరిగ్గా వినియోగించుకోలేదనిపిస్తోంది. వికెట్‌ తీసేందుకు అతడికి మరో రెండు ఓవర్లు ఇచ్చి ఉంటే బాగుండేది. అలా జరగలేదు. ఉమ్రాన్‌తో చివర్లో బౌలింగ్‌ చేయించి ఉంటే అతడూ వికెట్లు తీసే అవకాశం కల్పించినట్లు ఉండేది. ఉమ్రాన్‌ మాలిక్‌ను వరల్డ్‌ కప్‌ కోసం బ్యాకప్ పేసర్‌గా పరిగణిస్తే మాత్రం పొరపాటు చేసినట్లవుతుంది. ఎందుకంటే అతడు గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ క్రికెట్‌ ఎక్కువగా ఆడలేదు. గత ఐపీఎల్‌లోనూ రాణించలేకపోయాడు. అలాగే ఆసియా గేమ్స్‌కు కూడా ఎంపిక చేయలేదు. బుమ్రా ఫిట్‌నెస్‌ సాధించినా.. సాధించకపోయినా మరో ఎక్స్‌ప్రెస్ పేసర్‌ ఉండాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లుగా  ఉంది’’ అని ఆకాశ్‌ వ్యాఖ్యానించాడు. 

ఇషాన్‌ కిషన్‌ హాఫ్ సెంచరీపై..

‘‘విండీస్‌తో తొలి వన్డేలో భారత్‌ ప్రయోగాలు చేసింది. రోహిత్‌ స్థానంలో ఇషాన్‌ కిషన్‌ను ఓపెనర్‌గా పంపించింది. అక్కడ కిషన్‌ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే, ఈ అర్ధశతకంతో ఇషాన్‌ కొత్తగా ఏమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇప్పటికే అతడు అద్భుతమైన ఆటగాడని అందరికీ తెలుసు. వన్డేల్లో డబుల్‌ సెంచరీ సాధించిన ఆటగాడు. అయితే, సూర్యకుమార్‌ యాదవ్‌కు మాత్రం ఇదొక అద్భుత అవకాశం. కానీ, గొప్పగా పరుగులు చేయలేకపోయాడు. నా ప్రపంచకప్‌జట్టులో అతడికి చోటు ఉంటుంది. తప్పకుండా భారీ ఇన్నింగ్స్‌లు ఆడతాడని నమ్మకముంది’’ అని తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని