Ambati Rayudu: ఫైనల్‌ కోసం అలాంటి ‘పిచ్‌’ను ఉద్దేశపూర్వకంగా చేస్తే.. అది మూర్ఖత్వమే: రాయుడు

వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌లో (ODI World Cup 2023) టాస్‌ ఓడిపోయి భారత్ తొలుత బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చింది. ఇదే టీమ్‌ఇండియా ఓటమికి కారణమనే వ్యాఖ్యలను మాజీ ఆటగాడు అంబటి రాయుడు కొట్టిపడేశాడు.

Updated : 26 Nov 2023 15:42 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) ఫైనల్‌లో భారత ఓటమికి మందకొడి పిచ్‌ కారణమని మాజీ ఆటగాడు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. టాస్‌ ఏమాత్రం కీలకం కాదని చెబుతూనే.. పిచ్‌ పరిస్థితులు టీమ్‌ఇండియాకు కలిసిరాలేదని వ్యాఖ్యానించాడు. పిచ్‌ మామూలుగా ఉండుంటే మ్యాచ్‌ మరింత రసవత్తరంగా ఉండేదని పేర్కొన్నాడు. అప్పుడు ఆసీస్‌పై భారత్ ఆధిపత్యం ప్రదర్శించేదని రాయుడు తెలిపాడు. 

‘‘ఫైనల్‌ కోసం ఇలాంటి పిచ్‌ను తయారు చేసి ఉండాల్సింది కాదు. మరీ నెమ్మదిగా ఉంది. అయితే, ఇలా ఉండాలని ఎవరు సూచించారో తెలియదు. అలాంటి పిచ్‌ కాకుండా ఉండుంటే.. తప్పకుండా భారత్ విజయం సాధించేందుకు ఎక్కువ అవకాశాలు ఉండేవి. ఎందుకంటే ఆసీస్‌ కంటే అన్ని విభాగాల్లో బలంగానే ఉన్నాం. అయితే, ఫైనల్‌లో మనకు కలిసిరాలేదు.

ఫైనల్‌లో భారత్‌కు అనుకూలంగా పిచ్‌ను రూపొందించి ఉంటారని తొలుత కొంతమంది అనుకున్నారు. కానీ, పిచ్‌ మరీ మందకొడిగా ఉండటంతో టీమ్‌ఇండియా ఇబ్బంది పడింది. వంద ఓవర్లు పిచ్‌ ఒకటే అయినా.. స్పందించిన తీరు భిన్నంగా ఉంది. మ్యాచ్‌ సాగే కొద్దీ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతూ వచ్చేసింది. అయితే, టాస్‌కు అంత ప్రాధాన్యం లేదని చెబుతా. ప్రత్యేక కారణంతోనే ఇలా పిచ్‌ను తయారు చేసి ఉంటే మాత్రం ఇంతకుమించిన మూర్ఖత్వం మరొకటి లేదు. అలా చేసి ఉండరని భావిస్తున్నా’’ అని అంబటి రాయుడు తెలిపాడు. 

ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ 240 పరుగులకే ఆలౌట్‌ కాగా.. అనంతరం లక్ష్య ఛేదనలో ఆసీస్‌ 43 ఓవర్లలో నాలుగు వికెట్లను కోల్పోయి 241 పరుగులు చేసి విజయం సాధించింది. ట్రావిస్‌ హెడ్ (137) అద్భుత శతకంతో ఆసీస్‌ను గెలిపించాడు. దీంతో ఆరోసారి ఆ జట్టు కప్‌ను కైవసం చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని