Gautam Gambhir: అది వింత వాదన.. అత్యుత్తమ జట్టే ప్రపంచకప్‌ గెలిచింది: గౌతమ్ గంభీర్

అత్యుత్తమ జట్టు వన్డే ప్రపంచ కప్ సాధించలేదని పలువురు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వాదనను భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కొట్టిపారేశాడు. తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పాడు. 

Published : 22 Nov 2023 10:13 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ముగిసిన ప్రపంచ కప్‌ (World Cup 2023)లో ఓటమి అనేదే లేకుండా ఫైనల్‌ చేరిన టీమ్‌ఇండియా (Team India).. చివరి మెట్టుపై బోల్తా పడింది. ఫైనల్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా (Australia) ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది ఆరోసారి విశ్వవిజేతగా ఆవిర్భవించింది. అయితే, ఆసీస్ ప్రపంచకప్‌ గెలవడంపై పలువురు మాజీ ఆటగాళ్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అత్యుత్తమ జట్టుకు ప్రపంచ కప్‌ దక్కలేదని, టోర్నమెంట్‌లో టీమ్‌ఇండియానే బెస్ట్ అని భారత మాజీ ఆటగాడు మహ్మద్‌ కైఫ్‌తోపాటు మరికొంతమంది అభిప్రాయపడ్డారు. ఈ వాదనతో టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ఏకీభవించలేదు. ఇది వింత వాదన అని, అత్యుత్తమ జట్టే విశ్వ విజేతగా నిలిచిందని పేర్కొన్నాడు.    
 
‘‘చాలా మందికి ఇది నచ్చకపోవచ్చు. అత్యుత్తమ జట్టు ప్రపంచకప్ గెలవలేదని కొంతమంది విశ్లేషకులు చెప్పడం నేను విన్నాను. అది వాస్తవం కాదు. నేను విన్న వింత వాదనల్లో అది ఒకటి. వాస్తవానికి అత్యుత్తమ జట్టే ప్రపంచ కప్ గెలిచింది. నిజాయితీగా మాట్లాడుదాం. భారత్ 10 మ్యాచ్‌లు గెలిచి చాలా మంచి ఫామ్‌లో ఉంది. కాబట్టి వారు ఫేవరెట్‌గా బరిలోకి దిగారు. కానీ, ఆస్ట్రేలియా మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన తర్వాత వరుసగా ఎనిమిది విజయాలను అందుకొంది. అత్యుత్తమ జట్టు మాత్రమే ప్రపంచ కప్‌ను గెలుస్తుంది. మీరు దానిని ఆ విధంగా నిర్వచించలేరు. టీమ్‌ఇండియా 10 మ్యాచ్‌లు గెలిచింది. కానీ, ఒక మ్యాచ్‌లో పేలవంగా ఆడింది. సెమీ ఫైనల్, ఫైనల్ నాకౌట్ మ్యాచ్‌లు. లీగ్‌ దశలో అగ్రస్థానంలో నిలిచామా లేదా 4వ స్థానంలో నిలిచామా అనేది ముఖ్యం కాదు. అత్యుత్తమ జట్టు ప్రపంచకప్‌ సాధించిందని అంగీకరించండి. భారత్ బాగా ఆడలేదు. ఈ వాస్తవానికి దూరంగా ఆలోచించకండి’’ అని గంభీర్ వివరించాడు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని