IND vs BAN: పడగొట్టాలిక..
10.. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో భారత్ విజయానికి కావాల్సిన వికెట్లు. 2.. మ్యాచ్‌లో మిగిలిన రోజులు. తొలి మ్యాచ్‌లో ప్రత్యర్థిని చిత్తు చేయడానికి.. రెండు టెస్టుల సిరీస్‌లో శుభారంభం చేయడానికి టీమ్‌ఇండియా రంగం సిద్ధం చేసుకుంది.
విజయానికి 10 వికెట్ల దూరంలో టీమ్‌ఇండియా
బంగ్లా లక్ష్యం 513.. ప్రస్తుతం 42/0
శుభ్‌మన్, పుజారా శతకాలు
కుల్‌దీప్‌కు అయిదు వికెట్లు
10.. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో భారత్ విజయానికి కావాల్సిన వికెట్లు. 2.. మ్యాచ్‌లో మిగిలిన రోజులు. తొలి మ్యాచ్‌లో ప్రత్యర్థిని చిత్తు చేయడానికి.. రెండు టెస్టుల సిరీస్‌లో శుభారంభం చేయడానికి టీమ్‌ఇండియా రంగం సిద్ధం చేసుకుంది. సుదీర్ఘ ఫార్మాట్లో శుభ్‌మన్ తొలి శతకం సాధించిన వేళ.. దాదాపు నాలుగేళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ పుజారా సెంచరీ అందుకున్న తరుణాన.. మ్యాచ్‌పై భారత్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేసి.. రెండో ఇన్నింగ్స్‌లో భారీ లక్ష్యాన్ని నిర్దేశించి.. విజయం దిశగా సాగుతోంది. బౌలర్లు దూకుడు కొనసాగిస్తే.. శనివారమే గెలుపు దక్కొచ్చు.
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో టీమ్‌ఇండియా ఆధిపత్యం కొనసాగుతోంది. మొదట బంతితో విజృంభించి ప్రత్యర్థిని కుప్పకూల్చిన భారత్.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ చెలరేగి విజయానికి బాటలు వేసుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 133/8తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లా 150కే ఆలౌటైంది. గురువారం నాలుగు వికెట్లతో ప్రత్యర్థి నడ్డి విరిచిన కుల్‌దీప్ (5/40).. మూడో రోజు మరో వికెట్‌తో ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో కెరీర్ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. 254 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 258/2 వద్ద డిక్లేర్ చేసింది. శుభ్‌మన్ గిల్ (110; 152 బంతుల్లో 10×4, 3×6) టెస్టుల్లో తొలి శతకంతో.. చెతేశ్వర్ పుజారా (102 నాటౌట్; 130 బంతుల్లో 13×4) తన వేగవంతమైన సెంచరీతో సత్తాచాటారు. 513 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రెండో ఇన్నింగ్స్ మొదలెట్టిన బంగ్లా 42/0తో ఆట ముగించింది. నజ్ముల్ శాంటో (25 బ్యాటింగ్), జాకీర్ హసన్ (17 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. విజయానికి ఆ జట్టు ఇంకా 471 పరుగులు చేయాలి. డ్రాతో గట్టెక్కాలన్నా రెండు రోజుల పాటు భారత బౌలింగ్‌ను ఎదుర్కొని నిలవాలి. ప్రస్తుతం జోరు మీదున్న మన బౌలర్లు ప్రత్యర్థికి ఆ అవకాశం ఇచ్చేలా కనిపించడం లేదు. వీలైనంత త్వరగా 10 వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను ముగించాలనే పట్టుదలతో ఉన్నారు.
12 ఓవర్ల చొప్పున..: మూడో రోజు ఉదయం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్.. సాయంత్రానికి ఓటమి తప్పించుకోవాలనే లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించాల్సి వచ్చింది. మొదట మరో 12 ఓవర్లలోపే మిగతా రెండు వికెట్లు పడగొట్టిన మన బౌలర్లు.. ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్‌కు 150 పరుగుల వద్ద ముగింపు పలికారు. ఎబాదత్ (17)ను ఔట్ చేసిన కుల్‌దీప్ అయిదు వికెట్ల ఘనత సాధించాడు. మరో ఎండ్‌లో పోరాటం సాగించిన మెహదీ హసన్ (25)ను అక్షర్ (1/10) వెనక్కి పంపి జట్టు కథ ముగించాడు. రోజంతా శుభ్‌మన్, పుజారా బ్యాటింగ్ జోరుతో విసిగి వేసారిన బంగ్లా.. చివర్లో రెండో ఇన్నింగ్స్ మొదలెట్టింది. 12 ఓవర్ల పాటు క్రీజులో గడిపిన ఓపెనర్లు నజ్ముల్, జాకీర్ వికెట్ కోల్పోకుండా జాగ్రత్త పడ్డారు. ఒక్క వికెటైనా దక్కించుకోవాలనే ధ్యేయంతో బౌలర్లందరినీ రాహుల్ ప్రయోగించినా ఫలితం దక్కలేదు. మరి నాలుగో రోజు ఆటలో బంగ్లా ఎంత సేపు పోరాడుతుందో చూడాలి.
ఆ ఇద్దరూ అదుర్స్..: టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్, పుజారా అదరగొట్టారు. 254 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినా.. ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడించే అవకాశం ఉన్నా.. రాహుల్ బ్యాటింగ్‌కే మొగ్గుచూపాడు. రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా పరుగులు చేసి బంగ్లా ముందు భారీ లక్ష్యాన్ని నిలపాలనేదే అతని ఆలోచన అయి ఉండొచ్చు. శుభ్‌మన్, పుజారా ఆ పనిని సమర్థంగా నిర్వర్తించారు. బంగ్లా బౌలింగ్‌ను ఓ ఆటాడుకుంటూ పరుగులు సాధించారు. వెన్నెముక గాయంతో ప్రధాన పేసర్ ఎబాదత్ బంతి వేయలేకపోవడంతో బలహీనపడ్డ ప్రత్యర్థి బౌలింగ్‌లో వీళ్లు రెచ్చిపోయారు. శుభ్‌మన్‌తో తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించిన తర్వాత రాహుల్ (23) నిష్క్రమించాడు. అక్కడి నుంచి శుభ్‌మన్, పుజారా జోడీ ప్రత్యర్థి బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారి ఇన్నింగ్స్‌ను నడిపించింది. ఈ జంట రెండో వికెట్‌కు 113 పరుగులు జోడించింది. మొదట నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన శుభ్‌మన్ లంచ్ విరామం తర్వాత వేగం పెంచాడు. మెహదీ బౌలింగ్‌లో స్వీప్‌తో, తైజుల్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌తో షాట్లు ఆడాడు. క్రీజు వదిలి ముందుకొచ్చి స్పిన్నర్ల లయను దెబ్బతీశాడు. పేసర్ల బౌలింగ్‌లో ఏ మాత్రం అవకాశం దొరికినా బౌండరీలు రాబట్టాడు. 84 బంతుల్లో అర్ధశతకం చేరుకున్న అతను.. అక్కడి నుంచి గేరు మార్చాడు. ఖాలెద్ ఓవర్లో చక్కని సిక్సర్ కొట్టాడు. అతనికి అదృష్టం కూడా కలిసొచ్చింది. రెండు సార్లు సమీక్షలో వికెట్ కాపాడుకున్నాడు. మరోసారి బంగ్లాదేశ్ సమీక్ష కోరగా.. అప్పుడు డీఆర్‌ఎస్ పని చేయలేదు. మరోవైపు పుజారా కూడా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయడంతో భారత్ 140/1తో రెండో సెషన్ ముగించింది. టీ తర్వాతా ఈ ఇద్దరు మరింత స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు. ఫోర్‌తో 147 బంతుల్లో శుభ్‌మన్ తొలి టెస్టు శతకాన్ని అందుకున్నాడు. ఆ వెంటనే మరో సిక్సర్ బాది అతను ఔటైపోయాడు. అక్కడి నుంచి పుజారా బాదుడు మొదలైంది. 87 బంతుల్లో తొలి 50 పరుగులు చేసిన అతను.. ఆ తర్వాత మరో 43 బంతుల్లోనే శతకానికి చేరుకున్నాడు. ఓ ఎండ్‌లో కోహ్లి (19 నాటౌట్) నిలబడగా.. మరో ఎండ్‌లో పుజారా ఫోర్లతో సాగిపోయాడు. తన సహజ శైలికి పూర్తి విరుద్ధంగా.. తానూ వేగంగా ఆడగలనని చాటుతూ చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 10 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్న అతను.. ఈ సారి వదల్లేదు. ఫోర్‌తో అతను సెంచరీ చేరుకోగానే రాహుల్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. కోహ్లితో మూడో వికెట్‌కు అభేద్యమైన 75 పరుగుల భాగస్వామ్యంలో పుజారా పరుగులే 56. అవి 44 బంతుల్లోనే చేయడం అతని దూకుడుకు నిదర్శనం.
5/40
తొలి ఇన్నింగ్స్‌లో కుల్‌దీప్ గణాంకాలు. ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో ఇదే అతని అత్యుత్తమ ప్రదర్శన. అతను మూడోసారి ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్ల ఘనత సాధించాడు.
19
టెస్టుల్లో పుజారా శతకాల సంఖ్య. చివరగా 2019 జనవరిలో అతను ఆస్ట్రేలియాపై సెంచరీ చేశాడు. అతని గత 52 ఇన్నింగ్స్‌ల్లో ఇదే తొలి శతకం.
130
శతకానికి పుజారా తీసుకున్న బంతులు. టెస్టుల్లో ఇదే అతని వేగవంతమైన సెంచరీ. ఇంతకుముందు 2013లో వెస్టిండీస్‌పై 146 బంతుల్లో మూడంకెల స్కోరు అందుకున్నాడు.
ఈ శతకం ఎంతో ప్రత్యేకం
‘‘చాలా కాలానికి తొలి టెస్టు శతకం దక్కినట్లు అనిపిస్తోంది. మ్యాచ్‌లో కఠిన పరిస్థితులను దాటి ఆ మైలురాయి చేరుకున్నా. టెస్టుల్లో మొదటి సెంచరీ అందుకోవడం ఏ ఆటగాడికైనా ప్రత్యేకమే. నాక్కూడా అంతే. 90 పరుగులకు చేరుకున్నప్పుడు ఎలాంటి కొత్త ఆలోచనలు రాలేదు. ఫీల్డింగ్ స్థానాలను బట్టి పరుగులు రాబట్టడంపైనే దృష్టి పెట్టా. సహజ శైలిలోనే ఫోర్లు కొట్టి సెంచరీ సాధించా. బౌలర్ రౌండ్ ద వికెట్ నుంచి బౌలింగ్ చేస్తున్నప్పుడు థర్డ్‌మన్, పాయింట్ మధ్య ఖాళీ ఏర్పడింది. కానీ ఆ దిశగా షాట్లు ఆడలేదు. ఫీల్డర్ లోపలికి వచ్చిన తర్వాత పై నుంచి బౌండరీలు సాధించా. పరిస్థితులను బట్టి బ్యాటింగ్ కొనసాగించా. ఎప్పుడు దాడి చేయాలో ఓ బ్యాటర్‌గా తెలిసుండాలి’’
శుభ్‌మన్ గిల్
భారత్ తొలి ఇన్నింగ్స్: 404
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: నజ్ముల్ శాంటో (సి) పంత్ (బి) సిరాజ్ 0; జాకీర్ (సి) పంత్ (బి) సిరాజ్ 20; యాసిర్ (బి) ఉమేశ్ 4; లిటన్ (బి) సిరాజ్ 24; ముష్ఫికర్ ఎల్బీ (బి) కుల్‌దీప్ 28; షకిబ్ (సి) కోహ్లి (బి) కుల్‌దీప్ 3; నురుల్ (సి) గిల్ (బి) కుల్‌దీప్ 16; మెహదీ హసన్ (స్టంప్డ్) పంత్ (బి) అక్షర్ 25; తైజుల్ (బి) కుల్‌దీప్ 0; ఎబాదత్ (సి) పంత్ (బి) కుల్‌దీప్ 17; ఖాలెద్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం: (55.5 ఓవర్లలో ఆలౌట్) 150
వికెట్ల పతనం: 1-0, 2-5, 3-39, 4-56, 5-75, 6-97, 7-102, 8-102, 9-144
బౌలింగ్: సిరాజ్ 13-2-20-3; ఉమేశ్ 8-1-33-1; అశ్విన్ 10-1-34-0; కుల్‌దీప్ 16-6-40-5; అక్షర్ 8.5-4-10-1
భారత్ రెండో ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (సి) తైజుల్ (బి) ఖాలెద్ 23; శుభ్‌మన్ (సి) మహ్మదుల్ హసన్ (బి) మెహదీ హసన్ 110; పుజారా నాటౌట్ 102; కోహ్లి నాటౌట్ 19; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం: (61.4 ఓవర్లలో 2 వికెట్లకు) 258 డిక్లేర్
వికెట్ల పతనం: 1-70, 2-183
బౌలింగ్: ఖాలెద్ అహ్మద్ 13-0-51-1; తైజుల్ ఇస్లామ్ 23.4-3-71-0; మెహదీ హసన్ 14-1-82-1; యాసిర్ అలీ 6-0-28-0; లిటన్ దాస్ 2-0-13-0; నజ్ముల్ శాంటో 3-0-12-0
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: నజ్ముల్ శాంటో బ్యాటింగ్ 25; జాకీర్ బ్యాటింగ్ 17; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం: (12 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా) 42
బౌలింగ్: సిరాజ్ 3-0-11-0; ఉమేశ్ 1-1-0-0; అశ్విన్ 5-1-23-0; అక్షర్ 2-0-4-0; కుల్‌దీప్ 1-0-4-0
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Property: ఏనుగుల కోసం రూ.5 కోట్ల ఆస్తి
-
India News
మహిళలకు ప్రతీనెలా రూ.వెయ్యి పంపిణీ
-
India News
Lottery: సినీ నటి ఇంట్లో సహాయకుడు.. ఇప్పుడు కోటీశ్వరుడు
-
India News
క్యాన్సర్, అధిక రక్తపోటుకు అల్లోపతిలో చికిత్స లేదు: బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
Politics News
కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/03/23)