IND vs AUS: కొండంత కొట్టారు

ఇక ఈ పర్యటనలో ఆస్ట్రేలియాను ఓడించడం గురించి టీమ్‌ఇండియా దాదాపుగా మరిచిపోవచ్చు! రోహిత్‌ సేన ఇక పోరాడాల్సింది డ్రా కోసమే కావచ్చు! మూడో టెస్టులో బంతితో భారత్‌ను దెబ్బ కొట్టి మ్యాచ్‌ను ఎగరేసుకుపోయిన కంగారూలు.. ఈసారి బ్యాటుతో రెచ్చిపోయారు.

Updated : 11 Mar 2023 07:14 IST

ఖవాజా 180.. గ్రీన్‌ 114
ఆస్ట్రేలియా 480.. భారత్‌ 36/0

ఇక ఈ పర్యటనలో ఆస్ట్రేలియాను ఓడించడం గురించి టీమ్‌ఇండియా దాదాపుగా మరిచిపోవచ్చు! రోహిత్‌ సేన ఇక పోరాడాల్సింది డ్రా కోసమే కావచ్చు! మూడో టెస్టులో బంతితో భారత్‌ను దెబ్బ కొట్టి మ్యాచ్‌ను ఎగరేసుకుపోయిన కంగారూలు.. ఈసారి బ్యాటుతో రెచ్చిపోయారు. తొలి రోజు జోరును కొనసాగిస్తూ ఏకంగా 480 పరుగుల భారీ స్కోరు సాధించారు. ఉస్మాన్‌ ఖవాజా, కామెరూన్‌ గ్రీన్‌ జోడీ 200 పైచిలుకు భాగస్వామ్యంతో భారత బౌలర్లకు చుక్కలు చూపించింది. కొంచెం ఆలస్యంగా అయినా అశ్విన్‌ మాయ చేయబట్టి సరిపోయింది కానీ.. లేదంటే మ్యాచ్‌ దాదాపుగా కంగారూల చేతుల్లోకి వచ్చేసేదే. సిరీస్‌లో తొలిసారి బ్యాటింగ్‌కు పూర్తి అనుకూలంగా కనిపించిన పిచ్‌ను కంగారూలు పూర్తిగా ఉపయోగించుకోగా.. మూడో రోజు భారత బ్యాటర్లు కూడా సత్తా చాటితేనే కనీసం డ్రాపై ఆశలుంటాయి. లేదంటే మరో ఓటమితో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ అవకాశాలను భారత్‌ సంక్లిష్టం చేసుకోబోతున్నట్లే.

అహ్మదాబాద్‌

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో ఆలస్యంగా పుంజుకున్న ఆస్ట్రేలియా.. ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 0-2తో వెనుకబడ్డ స్థితిలో అనూహ్యంగా మూడో టెస్టులో విజయం సాధించిన ఆ జట్టు.. చివరి టెస్టులోనూ పట్టుబిగించే ప్రయత్నం చేస్తోంది. ఉస్మాన్‌ ఖవాజా (180; 422 బంతుల్లో 21×4), కామెరూన్‌ గ్రీన్‌ (114; 170 బంతుల్లో 18×4) రెండో రోజూ జోరు కొనసాగిస్తూ ద్విశతక భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 480 పరుగుల భారీ స్కోరు సాధించింది. అశ్విన్‌ (6/91) చివరి సెషన్లో విజృంభించకుంటే ఆస్ట్రేలియా ఇంకా పెద్ద స్కోరే చేసేది. చివరి 10 ఓవర్లలో బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. ఆట ఆఖరుకు వికెట్‌ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (17 బ్యాటింగ్‌; 33 బంతుల్లో 2×4), శుభ్‌మన్‌ గిల్‌ (18 బ్యాటింగ్‌; 27 బంతుల్లో 1×4, 1×6) నిలకడగా ఆడుతున్నారు. శుక్రవారం చివరి సెషన్లో బంతి బాగానే తిరిగిన నేపథ్యంలో మూడో రోజు బ్యాటింగ్‌ మరీ తేలిక కాకపోవచ్చు. శనివారం పూర్తిగా ఆడితే తప్ప భారత్‌కు మ్యాచ్‌లో ముప్పు తొలగినట్లు కాదు. మరి మన బ్యాటర్లు ఏం చేస్తారో చూడాలి.

అదే జోరు..: ఈ సిరీస్‌లో బౌలర్ల మీద బ్యాటర్లు ఆధిపత్యం చలాయిస్తూ స్వేచ్ఛగా పరుగులు సాధించడం చూసింది నాలుగో టెస్టు తొలి రోజు మాత్రమే. ఒకప్పటి సంప్రదాయ భారత పిచ్‌ల తరహాలో తొలి రోజు కాస్త పేసర్లకు సహకరించి, ఆపై బ్యాటర్లకు అనుకూలంగా మారిన పిచ్‌పై తొలి రోజు నిలకడగా ఆడి 255/4తో నిలిచిన ఆసీస్‌.. రెండో రోజు మరింత ఆత్మవిశ్వాసంతో ఆడి తిరుగులేని స్థితికి చేరుకుంది. తొలి రోజే 104 పరుగులు చేసిన ఖవాజా, 49 పరుగులపై ఉన్న గ్రీన్‌.. శుక్రవారం భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చలాయించారు. పేసర్లు, స్పిన్నర్లు అని తేడా లేకుండా అందరినీ అలవోకగా ఎదుర్కొన్నారు. రెండో రోజు ఈ జోడీని విడదీయడానికి భారత్‌ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఖవాజా, గ్రీన్‌ చక్కటి సమన్వయంతో బ్యాటింగ్‌ చేస్తూ.. స్పిన్నర్ల బౌలింగ్‌లో చక్కగా డిఫెన్స్‌ ఆడుతూ.. వీలు చిక్కినపుడల్లా బౌండరీలు కొడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. గ్రీన్‌ అయినా అప్పుడప్పుడూ కొంచెం ఇబ్బంది పడ్డాడు కానీ.. ఖవాజా మాత్రం బౌలర్లకు చిన్న అవకాశం కూడా ఇవ్వలేదు. 10 గంటలకు పైగా, అయిదు సెషన్ల బాటు అతడి బ్యాటింగ్‌ కొనసాగింది. లంచ్‌ లోపే అతను 150 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. విరామానంతరం గ్రీన్‌ శతకం పూర్తయింది. కాసేపటికే భాగస్వామ్యం 200 దాటింది.

అశ్విన్‌ మాయ: రెండో రోజు చివరి సెషన్‌కు ముందు కానీ.. పరిస్థితులు స్పిన్నర్లకు అనుకూలంగా మారలేదు. నెమ్మదిగా బంతి తిరగడం మొదలవడంతో అశ్విన్‌ బాగా ఉపయోగించుకున్నాడు. ఆసీస్‌ 4 వికెట్లతోనే 400కు చేరువ అవుతుండగా, అశ్విన్‌ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. గ్రీన్‌ను వికెట్‌ కీపర్‌ క్యాచ్‌తో పెవిలియన్‌ చేర్చాడు. అదే ఓవర్లో కేరీ (0) చెత్త షాట్‌ ఆడి ఔటవడంతో భారత్‌కు మరింత ఉపశమనం దక్కింది. కాసేపటికే స్టార్క్‌ (6)ను సైతం అశ్విన్‌ పెవిలియన్‌ చేర్చాడు. 9 పరుగుల తేడాలో ఆసీస్‌ 3 వికెట్లు కోల్పోవడంతో భారత శిబిరంలో ఉత్సాహం వచ్చింది. జట్టు స్కోరును 400 దాటించి.. తన కెరీర్లో తొలి డబుల్‌ సెంచరీ వైపు అడుగులు వేస్తున్న ఖవాజా సైతం చివరి సెషన్లో వెనుదిరిగాడు. అతణ్ని అక్షర్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆసీస్‌ 409/8తో ఉన్నట్లుండి కుప్పకూలుతున్నట్లు కనిపించింది. కానీ లైయన్‌ (34) తన కెరీర్లోనే అత్యధిక సమయం (133 నిమిషాలు) క్రీజులో గడపడమే కాక.. మర్ఫీ (41)తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 70 పరుగులు జోడించి భారత జట్టును అసహనంలోకి నెట్టాడు. చివరికి అశ్విన్‌ వీళ్లిద్దరినీ స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌ చేర్చి ఆసీస్‌ కథ ముగించాడు.


ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: హెడ్‌ (సి) జడేజా (బి) అశ్విన్‌ 32; ఖవాజా ఎల్బీ (బి)  అక్షర్‌ 180; లబుషేన్‌ (బి) షమి 3; స్టీవ్‌ స్మిత్‌ (బి) జడేజా 38; హాండ్స్‌కాంబ్‌ (బి) షమి 17; గ్రీన్‌ (సి) భరత్‌ (బి) అశ్విన్‌ 114; కేరీ (సి) అక్షర్‌ (బి) అశ్విన్‌ 0; స్టార్క్‌ (సి) శ్రేయస్‌ (బి) అశ్విన్‌ 6; లైయన్‌ (సి) కోహ్లి (బి) అశ్విన్‌ 34; మర్ఫీ ఎల్బీ (బి) అశ్విన్‌ 41; కునెమన్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 15 మొత్తం: (167.2 ఓవర్లలో ఆలౌట్‌) 480; వికెట్ల పతనం: 1-61,  2-72, 3-151, 4-170, 5-378, 6-378, 7-387, 8-409, 9-479; బౌలింగ్‌: షమి 31-3-134-2; ఉమేశ్‌ 25-2-105-0; అశ్విన్‌ 47.2-15-91-6; జడేజా 35-5-89-1; అక్షర్‌ 28-8-47-1 శ్రేయస్‌ 1-0-2-0

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ బ్యాటింగ్‌ 17; శుభ్‌మన్‌ బ్యాటింగ్‌ 18; ఎక్స్‌ట్రాలు 1 మొత్తం: (10 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 36; బౌలింగ్‌: స్టార్క్‌ 3-1-7-0; గ్రీన్‌ 2-0-11-0; లైయన్‌ 3-0-14-0; కునెమన్‌ 2-0-3-0


అశ్విన్‌కు 6 వికెట్లు

అతడే నం.1

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియాపై అతను 22 టెస్టుల్లో 28.10 సగటుతో 113 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్‌ స్పిన్నర్‌ లైయన్‌ కూడా 113 వికెట్లే తీసినప్పటికీ అతను 26 మ్యాచ్‌లు ఆడాడు.


1

19వ టెస్టు ఆడుతున్న కామెరూన్‌ గ్రీన్‌కు అంతర్జాతీయ క్రికెట్లో ఇదే తొలి సెంచరీ.


180

ఖవాజా పరుగులు. భారత్‌లో ఆస్ట్రేలియా తరఫున ఇది మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు.


208

ఖవాజా, గ్రీన్‌ అయిదో వికెట్‌కు జోడించిన పరుగులు. 1979 తర్వాత ఆస్ట్రేలియాకు భారత్‌లో ఇదే తొలి ద్విశతక భాగస్వామ్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని