GT vs MI: టైటాన్స్‌.. అదుర్స్‌

137/4.. శుభ్‌మన్‌ మెరుపులతో 16 ఓవర్లకు టైటాన్స్‌ స్కోరిది. ఇంకో 4 ఓవర్లే ఉన్నాయి.. 180కి అటు ఇటుగా ఆ జట్టు ఇన్నింగ్స్‌ ముగుస్తుందనిపించింది.

Updated : 26 Apr 2023 06:50 IST

ముంబయిపై ఘనవిజయం
రాణించిన శుభ్‌మన్‌
చెలరేగిన మిల్లర్‌, అభినవ్‌
తిప్పేసిన రషీద్‌, అహ్మద్‌

అహ్మదాబాద్‌

137/4.. శుభ్‌మన్‌ మెరుపులతో 16 ఓవర్లకు టైటాన్స్‌ స్కోరిది. ఇంకో 4 ఓవర్లే ఉన్నాయి.. 180కి అటు ఇటుగా ఆ జట్టు ఇన్నింగ్స్‌ ముగుస్తుందనిపించింది. కానీ ఆ తర్వాతే అహ్మదాబాద్‌ స్టేడియాన్ని సిక్సర్ల సునామీ ముంచెత్తింది. బంతి గాల్లో ఎగురుతూనే కనిపించింది. అందుకు కారణం.. అభినవ్‌, మిల్లర్‌, తెవాతియా విధ్వంసమే! వీళ్లు ఎడాపెడా సిక్సర్లతో విరుచుకుపడడంతో ఆఖరి 4 ఓవర్లలో 70 పరుగులు వచ్చాయి. అనంతరం అఫ్గాన్‌ స్పిన్‌ ద్వయం రషీద్‌, అహ్మద్‌ ముంబయిని చుట్టేశారు.

ఐపీఎల్‌- 16లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ అయిదో విజయాన్ని దక్కించుకుంది. మంగళవారం ఏకపక్షంగా సాగిన పోరులో ఆ జట్టు 55 పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్‌ను చిత్తుచేసింది. మొదట టైటాన్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 207 పరుగులు చేసింది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్‌ గిల్‌ (56; 34 బంతుల్లో 7×4, 1×6) మరో అర్ధశతకాన్ని అందుకోగా.. మిల్లర్‌ (46; 22 బంతుల్లో 2×4, 4×6), అభినవ్‌ మనోహర్‌ (42; 21 బంతుల్లో 3×4, 3×6), రాహుల్‌ తెవాతియా (20 నాటౌట్‌; 5 బంతుల్లో 3×6) విధ్వంసం సృష్టించారు. ముంబయి బౌలర్లలో పియూష్‌ చావ్లా (2/34) ఆకట్టుకున్నాడు. అనంతరం నూర్‌ అహ్మద్‌ (3/37), రషీద్‌ ఖాన్‌ (2/27), మోహిత్‌ శర్మ (2/38) దెబ్బకు ఛేదనలో ముంబయి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 152 పరుగులకే పరిమితమైంది. నేహల్‌ (40; 21 బంతుల్లో 3×4, 3×6) టాప్‌స్కోరర్‌.

ఏ దశలోనూ..: ఒక సిక్సర్‌, ఒక ఫోర్‌ (బ్యాటర్‌ సాధించింది), ఒక వికెట్‌.. వెరసి పవర్‌ప్లేలో 29/1. ఇదీ భారీ ఛేదనను ముంబయి ఆరంభించిన తీరు. పేలవంగా మొదలెట్టిన ఆ జట్టు  ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లోనే కెప్టెన్‌ రోహిత్‌ (2)ను వెనక్కిపంపి ప్రత్యర్థికి హార్దిక్‌ (1/10) షాకిచ్చాడు. ఇషాన్‌ (21 బంతుల్లో 13) క్రీజులో ఉన్నా నత్తనడనక బ్యాటింగ్‌ కొనసాగించాడు. తాను ఆడిన తొలి 10 బంతుల్లో 2 పరుగులే చేసిన అతను.. 12వ బంతికి కానీ బౌండరీ సాధించలేకపోయాడు. ఇషాన్‌ మరిన్ని బంతులు వృథా చేసి రషీద్‌ వలలో చిక్కాడు. కార్తీకేయ స్థానంలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన తిలక్‌ (2).. అదే ఓవర్లో రషీద్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. ఓ ఎండ్‌లో వికెట్లు పడ్డా.. మరో వైపు గ్రీన్‌ (33) పోరాటం సాగించాడు. అయినా 10 ఓవర్లకు 58/3తో నిలిచిన ముంబయి ఓటమి ఖాయమైంది. సాధించాల్సిన రన్‌రేట్‌ 15 దాటడంతో బ్యాటర్లు భారీ షాట్లకు ప్రయత్నించక తప్పలేదు. ఈ క్రమంలో అహ్మద్‌ ఒకే ఓవర్లో గ్రీన్‌తో పాటు డేవిడ్‌ (0)ను ఔట్‌ చేసి ముంబయి పతనాన్ని వేగవంతం చేశాడు. బంతిని తప్పుగా అంచనా వేసి గ్రీన్‌ బౌల్డవగా.. డేవిడ్‌ రాగానే బంతిని గాల్లోకి లేపి అభినవ్‌ చేతికి చిక్కాడు. ఆ తర్వాత సూర్యకుమార్‌ (23) మెరుపులు కాసేపే. అహ్మద్‌ తన తర్వాతి ఓవర్లో రిటర్న్‌ క్యాచ్‌ను డైవ్‌ చేసి పట్టడంతో సూర్య నిష్క్రమించాడు. యువ ఆటగాడు నేహల్‌ భారీ షాట్లతో ఆకట్టుకున్నాడు. పోరాడితే పోయేదేముంది అన్నట్లు బౌండరీలతో చెలరేగాడు. ఉన్నంత సేపు అలరించిన అతణ్ని.. మోహిత్‌ పెవిలియన్‌ చేర్చాడు. ఓ సిక్సర్‌తో జోరు ప్రదర్శించిన అర్జున్‌ (13)ను కూడా మోహితే ఔట్‌ చేశాడు.

మెరుపు ముగింపు..: అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్‌ ఇన్నింగ్స్‌ నెమ్మదిగా మొదలై.. శుభ్‌మన్‌ మెరుపులతో జోరందుకుంది. అభినవ్‌, మిల్లర్‌, తెవాతియా సంచలన బ్యాటింగ్‌తో ఘనంగా ముగిసింది. పంజాబ్‌తో గత మ్యాచ్‌లో ఒకే ఓవర్లో 31 పరుగులిచ్చిన ముంబయి పేసర్‌ అర్జున్‌ (1/9).. టైటాన్స్‌తో పోరులో బలంగా పుంజుకున్నాడు. మంచి వేగం, కచ్చితమైన లైన్‌, లెంగ్త్‌తో క్రమశిక్షణగా బౌలింగ్‌ చేసిన అతను తన తొలి రెండు ఓవర్లలో 9 పరుగులే ఇచ్చి సాహా (4)ను ఔట్‌ చేశాడు. దీంతో అయిదు ఓవర్లకు టైటాన్స్‌ స్కోరు 33/1. గ్రీన్‌ (0/39) వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా 4, 4, 6 బాదిన శుభ్‌మన్‌ ఇన్నింగ్స్‌కు వేగాన్ని అందించాడు. ఆ వెంటనే హార్దిక్‌ (13)ను చావ్లా వెనక్కిపంపినా.. శుభ్‌మన్‌ మాత్రం తనదైన శైలిలో చూడముచ్చటైన షాట్లతో బౌండరీలు రాబట్టాడు. కవర్‌డ్రైవ్‌, కట్‌, పుల్‌ షాట్లతో సత్తాచాటాడు. మరో ఎండ్‌లో విజయ్‌ శంకర్‌ (19) కూడా కుదురుకోవడంతో 11 ఓవర్లకు 91/2తో టైటాన్స్‌ భారీస్కోరుపై కన్నేసింది. వరుస ఓవర్లలో శుభ్‌మన్‌, శంకర్‌ను ఔట్‌ చేసినా ఆ ఆనందం ముంబయికి మిగల్చకుండా మిల్లర్‌, అభినవ్‌ చెలరేగారు. చావ్లా బౌలింగ్‌ అభినవ్‌ వరుసగా రెండు ఫోర్లతో పాటు కళ్లు చెదిరేలా బౌలర్‌ తలమీదుగా సిక్సర్‌ కొట్టాడు. గ్రీన్‌ వేసిన 18వ ఓవర్‌ నుంచి విధ్వంసం తారస్థాయికి చేరి సిక్సర్ల వర్షం కురిసింది. ఆ ఓవర్లో అభినవ్‌ వరుసగా రెండు సిక్సర్లు, మిల్లర్‌ ఓ సిక్సర్‌ రాబట్టడంతో 22 పరుగులొచ్చాయి. అదే ఊపులో మరో భారీషాట్‌కు ప్రయత్నించి అభినవ్‌ ఔటైనా.. తెవాతియాతో కలిసి మిల్లర్‌ విధ్వంసం కొనసాగించాడు. తెవాతియా వస్తూనే బంతిని స్టాండ్స్‌లో పడేశాడు. 19వ ఓవర్‌ చివరి రెండు బంతులకూ మిల్లర్‌ అదే చేశాడు. చివరి ఓవర్లో తెవాతియా వరుసగా రెండు సిక్సర్లు కొట్టడంతో జట్టు స్కోరు 200 దాటింది.

గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాహా (సి) ఇషాన్‌ (బి) అర్జున్‌ 4; శుభ్‌మన్‌ (సి) సూర్య (బి) కార్తీకేయ 56; హార్దిక్‌ (సి) సూర్య (బి) పియూష్‌ 13; విజయ్‌ శంకర్‌ (సి) డేవిడ్‌ (బి) చావ్లా 19; మిల్లర్‌ (సి) సూర్య (బి) బెరెన్‌డార్ఫ్‌ 46; అభినవ్‌ (సి) బెరెన్‌డార్ఫ్‌ (బి) మెరెడిత్‌ 42; తెవాతియా నాటౌట్‌ 20; రషీద్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 207; వికెట్ల పతనం: 1-12, 2-50, 3-91, 4-101, 5-172, 6-205; బౌలింగ్‌: అర్జున్‌ 2-0-9-1; బెరెన్‌డార్ఫ్‌ 4-0-37-1; మెరెడిత్‌ 4-0-49-1; గ్రీన్‌ 2-0-39-0; పియూష్‌ 4-0-34-2; కార్తీకేయ 4-0-39-1

ముంబయి ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) అండ్‌ (బి) హార్దిక్‌ 2; ఇషాన్‌ (సి) లిటిల్‌ (బి) రషీద్‌ 13; గ్రీన్‌ (బి) నూర్‌ 33; తిలక్‌ ఎల్బీ (బి) రషీద్‌ 2; సూర్యకుమార్‌ (సి) అండ్‌ (బి) నూర్‌ 23; డేవిడ్‌ (సి) అభినవ్‌ (బి) నూర్‌ 0; నేహల్‌ (సి) షమి (బి) మోహిత్‌ 40; పియూష్‌ రనౌట్‌ 18; అర్జున్‌ (సి) లిటిల్‌ (బి) మోహిత్‌ 13; బెరెన్‌డార్ఫ్‌ నాటౌట్‌ 3; మెరెడిత్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 152; వికెట్ల పతనం: 1-4, 2-43, 3-45, 4-59, 5-59, 6-90, 7-135, 8-137, 9-152; బౌలింగ్‌: షమి 4-0-18-0; హార్దిక్‌ 2-0-10-1; రషీద్‌ ఖాన్‌ 4-0-27-2; నూర్‌ అహ్మద్‌ 4-0-37-3; మోహిత్‌ శర్మ 4-0-38-2; జోష్‌ లిటిల్‌ 2-0-18-0

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు